15-06-2024 RJ
సినీ స్క్రీన్
ఇప్పుడు అటు ఓటిటి లోనూ, ఇటు వెండితెరపైనే వినిపిస్తున్న పేరు శ్రియ రెడ్డి. తెలుగు, తమిళం, మలయాళం సినిమాలలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న నటి శ్రియ రెడ్డి. ప్రభాస్ నటించిన ’సలార్’ సినిమాలో విలన్ గా నటించి అందరినీ మెప్పించిన నటి శ్రియ ఇప్పుడు అటు వెబ్ సిరీస్ లతో, ఇటు సినిమాలతో చాలా బిజీగా వున్న నటీమణుల్లో ఒకరు. ఆమధ్య అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ’సుజల్: ది వోర్టెక్స్’ అనే వెబ్ సిరీస్ లో పోలీసాఫీసర్ గా నటించి మంచి ప్రసంశలు పొందిన నటి. ఆ వెబ్ సిరీస్ లో ఒక ప్రధాన పాత్ర అయిన పోలీసు ఆఫీసరు రెజినా థామస్‌గా నటించి మెప్పించింది. ఫ్యాక్టరీ కాలిపోవడంతో మొదలైన ఆ వెబ్ సిరీస్ లోతుకు వెళ్లేకొద్దీ ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వస్తుంటాయి.
ప్రేక్షకులు ఊహించినట్టే ఉంటుంది అనుకున్న సమయానికి, ఊహకందని విధంగా ట్విస్టులు వస్తూ ఉంటాయి, సస్పెన్సు కొనసాగుతూ ఉంటుంది. మొదటి ఎపిసోడ్ నుండి చివరి వరకూ ఆ ఆసక్తికరమైన అంశం అలా కొనసాగుతూనే ఉంటుంది. అన్ని ఎపిసోడ్స్ లో కూడా శ్రియ తనదైన నటనతో మెప్పించి, ఆ పాత్రలో లీనమైపోయింది. ఒక పక్క పోలీసాఫీసరుగా తన బాధ్యతలు నెరవేరుస్తూనే, అందులోవుండే సాధకబాధకాలు, అలాగే ఇంకో పక్క ఒక టీనేజర్ అబ్బాయికి తల్లిగా శ్రియ చేసిన నటన అబ్బురపరిచింది. చివరి వరకు అలానే కంటిన్యూ చేసి ఆ వెబ్ సిరీస్ విజయంలో శ్రియ ముఖ్య భూమిక పోషించింది. ఈమధ్యనే విడుదలైన ఇంకో వెబ్ సిరీస్ ’తలైమై సేయలగం’. ఇది పొలిటికల్ థ్రిల్లర్ గా వచ్చింది.
పవన్ కళ్యాణ్ నటించిన ’ఓజి’ లో కూడా శ్రియ ఒక ముఖ్యపాత్ర పోషిస్తోంది. ’సలార్’ పార్టు 2 లో శ్రియ పాత్ర ఇంకా బాగుంటుంది అని కూడా అంటున్నారు. ఆమెని ప్రధాన విలన్ గా చూపించవచ్చు అని కూడా ఒక టాక్ నడుస్తోంది. ఈ సినిమాతో పాటు ఇంకో తమిళ సినిమా కూడా చేస్తున్న శ్రియ తనకి నచ్చిన పాత్రలు చేస్తూ అందరినీ మెప్పిస్తోంది.