17-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
పోలవరం, జూన్ 17: చెప్పిన విధంగానే సిఎం చంద్రబాబు పోలవరం చేరుకున్నారు. ప్రతి సోమవారం ప్రాజెక్టు పనులు పరిశీలిస్తాననన బాబు తొలి సోమవారం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు వస్తూ హెలికాప్టర్ నుంచి స్పిల్‌వే సహా వివిధ ప్రాంతాలను ఆయన వీక్షించారు. ప్రాజెక్టు సవిూపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథితో పాటు ఎమ్మెల్యేలు, తెదేపా ముఖ్య నేతలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రాజెక్టు వద్దకు చేరుకుని అధికారులతో మాట్లాడారు. స్పిల్‌వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత వారితో కలిసి బస్సులో ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. గతంలో ఎడమగట్టు వద్ద కుంగిన గైడ్‌బండ్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. 22, 23 గేట్ల నుంచి ప్రాజెక్టు పరిసరాలను చూశారు. పరిశీలన అనంతరం మధ్యాహ్నం 2 గంటల తర్వాత అధికారులతో సీఎం సవిూక్ష నిర్వహించనున్నారు. 3 గంటల తర్వాత విూడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడిరచనున్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి పర్యటన ఇదే. 2014-19 మధ్య సోమవారాన్ని పోలవారంగా పిలుస్తూ క్రమం తప్పకుండా ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు. అదే తరహాలో ఇప్పుడూ సోమవారం రోజునే ప్రాజెక్టు సందర్శనను మొదలుపెట్టారు.