17-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
సింహాచలం, జూన్ 17: గత ప్రభుత్వంలో కొందరు పోలీస్ అధికారులు దురుసుగా ప్రవర్తించారని, స్వామి సేవలో తరించారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అలాంటి వారు మారాలని లేకుంటే ఉద్యోగం వదిలి వెళ్లాలని అన్నారు. ఇకపోతే రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచి జరగాలని సింహాద్రి అప్పన్న స్వామిని కోరుకున్నానని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సింహాచలంలో స్వామి వారిని ఆమె దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అనిత విూడియాతో మాట్లాడారు. మంత్రి పదవి వచ్చిన తర్వాత అప్పన్న స్వామిని దర్శించుకోవాలని ఇక్కడికి వచ్చానని తెలిపారు.
సింహాచలం దేవస్థానం భూములు ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాకుండా చూస్తానన్నారు. పంచగ్రామాల భూ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని చెప్పారు. వైకాపా ప్రభుత్వంలో కొంతమంది పోలీసు అధికారులు ఆ పార్టీ నేతలకు తొత్తులుగా పనిచేశారని అనిత విమర్శించారు. ఇప్పటికీ వారిలో వైకాపా రక్తం ప్రవహిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. జగన్‌పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పార్టీ కోసం పనిచేసుకోవాలని హితవు పలికారు. శాంతిభద్రతల విషయంలో ఎవరు తప్పుచేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ముఖ్యంగా మహిళలకు అన్యాయం జరగకుండా చూస్తానని తెలిపారు.