17-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 17: బీఆర్‌ఎస్ హయాంలో అస్తవ్యస్థమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 12 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్షను తామే నిర్వహించామని చెప్పారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. పింఛన్ల పెంపులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఏపీ సీఎం చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలన్న మాజీ మంత్రి హరీశ్ వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు. హరీశ్ రావు చంద్రబాబును ఉదాహరణగా తీసుకున్నారంటే ఆయన పరిస్థితి ఏంటో అర్థమవుతుందని విమర్శించారు. తాము తెలంగాణ ప్రజలు ఆలోచనలను అమలు చేస్తాం కానీ.. ఏపీ ఆలోచనలు కాదన్నారు. తాము చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఆశ వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీష్‌కు లేదన్నారు.
వాళ్ల హయాంలో ఆశా వర్కర్స్‌ను గుర్రాలతో తొక్కించారని విమర్శించారు. త్వరలోనే ఇచ్చిన హావిూలను అమలు చేస్తామని చెప్పారు. పెద్దపల్లిలో జరిగిన ఘటనపై విచారణ జరుగుతుందన్నారు శ్రీధర్ బాబు. ఘటన జరగడం దురదృష్టకరమని.. శాంతి భద్రత విషయంలో తమ ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. మెదక్‌లో జరిగిన మతఘర్షణల విషయంలో సీరియస్ గా ఉన్నాం.. ఘటన వెనక ఎవరి హస్తం ఉన్నా ఉక్కు పాదంతో అణిచివేస్తామని చెప్పారు.