17-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 17: ఆంధప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఒక్కొక్కరుగా రాజీనామా చేయడం మొదలుపెట్టారు. మాజీ మంత్రి, సీనియర్ నేత రావెల కిశోర్ బాబుతో రాజీనామాలు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు సీనియర్లు, కీలక నేతలు, రాజీనామా చేసి బయటికి వచ్చేశారు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత శిద్దా రాఘవరావు పార్టీకి రాజీనామా చేసి.. తన రాజీనామా లేఖను అధినేత జగన్ మోహన్ రెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు శిద్దా ప్రకటన కూడా చేశారు. 2019 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీచేసిన శిద్దా ఓడిపోయి.. వైసీపీ అధికారంలోకి రాగానే కండువా కప్పేసుకున్నారు.
వైసీపీలో చేరాక పెద్దగా ప్రాధాన్యత కూడా ఏవిూ లేకపోవడం ఆఖరికి ఎమ్మెల్యే టికెట్ కూడా రాకపోవడంతో ఇక పార్టీలో ఉన్నా ప్రయోజనమేవిూ లేదని ఇలా రాజీనామా చేసినట్లుగా అనుచరులు చెప్పుకుంటున్నారు. మొన్నటి ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చి దర్శి టికెట్ కోసం ఈయన గట్టి ప్రయత్నాలే చేసినట్టుగా ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే.. అప్పుడే వద్దన్న టీడీపీ పెద్దలు.. ఇప్పుడు అస్సలు పార్టీలోకి నో ఎంట్రీ అని తేల్చి చెప్పేశారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌ను కలిసి టీడీపీ కండువా కప్పుకోవడానికి శిద్దా ప్రయత్నాలు చేసినప్పటికీ ఎలాంటి మొహమాటం లేకుండా చేరికను అంగీకరించలేదు.