17-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 17: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణకు రాష్ట్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. బాధ్యతల నుంచి రిలీవ్ కావొద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆయనకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎన్టీయే ప్రభుత్వం ఏర్పడడంతో మూడ్రోజుల కిందట సత్యనారాయణ నేరుగా వెళ్లి నార్త్ ఈస్టర్న్ రైల్వేలో జాయిన్ అయ్యారు. రైల్వే ఉన్నతాధికారులు సైతం ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇచ్చారు. జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలంటే సత్యనారాయణకు రిలీవింగ్ ఆర్డర్ కావాలి. ఈలోపే విషయం తెలుసుకున్న సీఎస్ నీరబ్ కుమార్ రిలీవ్ కావొద్దంటూ ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వంతో అంటకాగారనే తీవ్ర ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అందులోనూ ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రావత్ సిక్ లీవ్‌లో ఉండటంతో ఈనెల 18న రిలీవ్ కావాల్సిన అవసరం లేదంటూ సీఎస్ స్పష్టం చేశారు. దీంతో సత్యనారాయణ ఎస్కేప్ ప్రయత్నాలకు చెక్ పడినట్లయ్యింది.
2017లో రైల్వే నుంచి వచ్చి ఏపీ ఆర్థిక శాఖలో సెక్రెటరీగా ఐఆర్‌ఎస్ అధికారి సత్యనారాయణ జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి ఆ శాఖలో ఆయన అరాచకం సృష్టించారు. అనేక అవకతవకలకు ఆయనే కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో కేవలం వైసీపీ నేతల అనుచరులుగా ఉన్న కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు చెల్లించి మిగతా వారిని పక్కన పెట్టారనే తీవ్ర ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో బిల్లుల కోసం హైకోర్ట్‌లో వేల సంఖ్యలో కేసులు, కోర్టు ధిక్కార కేసులు నమోదయ్యాయి. భవిష్యత్ ఆదాయాన్ని సైతం తాకట్టుపెట్టి అప్పు తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్ వస్తే చాలు ఎవరికి బిల్లులు చెల్లించమంటే వారికి చెల్లించారు. ఎన్డీయే ప్రభుత్వం రాగానే భయంతో ఆయన రిలీవ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో విషయం తెలుసుకున్న సీఎస్ ఆయనకు చెక్ పెట్టారు.