17-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 17: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంత్రి వర్గం తొలి సమావేశంపై కసరత్తు జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 18న జరగాల్సిన ఏపీ క్యాబినెట్ భేటీ వాయిదా పడిరది. జూన్ 22న ఏపీ కేబినెట్ తొలి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇంకా కొందరు మంత్రులు బాధ్యతలు తీసుకోకపోవడం, ఆయా శాఖల వారీగా నివేదికలు తయారు చేయడానికి సమయం పట్టేలా కనిపిస్తోంది. దాంతో చంద్రబాబు క్యాబినెట్ తొలి భేటీ నాలుగు రోజులు వాయిదా పడినట్లు సమాచారం. జూన్ 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని భావిస్తున్నారు. దాదాపు 5 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దీనిపై ఏపీ ప్రభుత్వ వర్గాల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జూన్ 18న కేబినెట్ తొలి సమావేశం జరపాలని నిర్ణయించారు.
ఆ మరుసటి రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు అంతా భావించారు. కానీ కొందరు మంత్రులు ఇంకా బాధ్యతలు తీసుకోలేదు, మరోవైపు అన్ని శాఖల నివేదికలు సిద్ధం కాకపోవడంతో తొలి కేబినెట్ భేటీని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. ఏపీ లాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం, డీఎస్సీ పోస్టుల భర్తీ, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు లాంటి పలు నిర్ణయాలను కేబినెట్ భేటీలో పెట్టి ఆమోదం తెలపనున్నారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం ఉంటుంది. స్పీకర్ ఎన్నిక నిర్వహించి, అనంతరం సమావేశాలు కొనసాగించనున్నారు. బడ్జెట్ కు సైతం ఆమోదం తెలపాలి.