17-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 17: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు మరింత వేగం పెంచారు. తాజాగా, ఈ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ చానల్ ఓనర్ శ్రవణ్ రావును త్వరలోనే అమెరికా నుంచి రానున్నారు. వీళ్లను తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా, ఈ కేసులో కీలకమైన టెక్నికల్ ఆధారాలను దర్యాప్తు బృందం సేకరించింది. హైదరాబాద్ పట్టణంలోని కొండాపూర్‌లో కన్వర్జేన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్‌లో దర్యాప్తు అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మేరకు కన్జర్వేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్‌లో మూడు సర్వర్లు, హార్డ్ డిస్క్‌లతో పాటు ఐదు మాక్ మినీ డివైజ్‌లు సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు ఆ సంస్థ డైరెక్టర్ పాల్ రవికుమార్‌కు నోటీసులు అందించారు.
అనంతరం ఆయనను విచారణ చేస్తున్నారు. ఈ కేసులో కీలకమైన ఆధారాలను ఆయన నుంచి సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇఫ్పటికే టెక్నికల్ ఎవిడెన్స్‌కు సంబంధించిన వివరాలను పోలీసులు రాబట్టినట్లు సిట్ వెల్లడిరచింది. కన్జర్వేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్‌లో పనిచేసే ఓ సీనియర్ మేనేజర్ రాగి అనంత చారి, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఓలేటి సీతారం శ్రీనివాస్‌ల స్టేట్‌బమెంట్ తదితర విషయాలను రికార్డు చేశారు. అనంతరం కన్జర్వేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ పరికరాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అయితే ఆ సంస్థ డైరెక్టర్ పాల్ రవికుమార్ 160 సీఆర్పీసీ నోటీస్ జారీ చేసి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో సిట్ ముమ్మరంగా దర్యాప్తు చేపడుతోంది. త్వరలోనే మరిన్ని కీలక ఆధారాలు వెల్లడిరచనున్నట్లు సీట్ పేర్కొంది.