17-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
శ్రీకాకుళం, జూన్ 17: కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడులకు శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఆత్మీయ అభినందన సభ జరిగింది. వీరికి జిల్లా ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అబ్బాయ్, బాబాయ్ రాకతో జిల్లాలో కొత్త ఉత్సాహం కనిపించింది. శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిక్కోలు ప్రజల కల నిజమైందని, సిక్కోలు ప్రజల్లానే మోదీ, చంద్రబాబు తనపై దృష్టి పెట్టారని, చిన్న వయస్సులోనే కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారని ప్రస్తావించారు. ఇది సిక్కోలు ప్రజల విజయమని వ్యాఖ్యానించారు. కష్టం నష్టంలో సిక్కోలు ప్రజలు నాకు అండగా ఉన్నారు. మంత్రి పదవిని ఉపయోగించుకొని జిల్లా సమస్యలు పరిష్కరిస్తాను. జిల్లా మారాలి 5 సంవత్సరాలు కష్టపడి అభివృద్ధి చేస్తాను‘ అని రామ్మోహన్ నాయుడు అన్నారు.
10 సంవత్సరాల తన కష్టాన్ని చూసి మంత్రి పదవి ఇచ్చారని, రాష్టాన్రికి ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తానని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ‘నిప్పులాంటి మనిషిని జైల్లో పెట్టారు. చిత్ర హింసలు పెట్టిన వారిని బ్రహ్మ దేవుడు కూడా రక్షించలేడు‘ అని అన్నారు. ఇక ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. దుర్మార్గమైన వ్యక్తి రాష్ట్రాన్ని పాలించాడని జగన్‌పై మండిపడ్డారు. గాలికి పుట్టిన పార్టీలు గాలికే పోతాయి. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు. మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి గాడిలో పెట్టి అగ్రగామిగా తయారు చేస్తాం. మాది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం. నన్ను గెలిపించిన జిల్లా ప్రజలకి జన్మాంతం సేవ చేసుకుంటా. జిల్లా రైతాంగాన్ని అభివృద్ధి చేస్తాను. నా సత్తా చూసి మంత్రి శాఖ ఇచ్చారు. అభివృద్ధి చేసి చూపిస్తా‘ అని అచ్చెన్నాయుడు అన్నారు.