18-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అనకొండలు రాజ్యమేలితే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందనడానికి తెలుగు రాష్టాల్రను పాలించిన కెసిఆర్, జగన్ అక్రమాలే నిదర్శనం. విభజన వల్ల ప్రజలకు మేలు జరగకపోగా అప్పులను మాత్రం నెత్తిన పెట్టారు. తమ విలాసాల కోసం భవంతులను నిర్మించుకుని, లక్షల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారు. విభజన జరిగిన పదేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ రెండు కుటుంబాలు రాచరికం అనుభవిం చాయి. తమ హంగూ ఆర్భాటానికి వేలకోట్లు దుర్వినియోగం చేశాయి. వారికి అధికారంతో పాటు, సకల సుఖాలు దక్కాయి. వెరసి ఓ పదిపన్నెండు లక్షల కోట్లు దుర్వినియోగం కావడమే గాకుండా మోయలేని అప్పులు సమకూరాయి. కానీ ప్రజల జీవితాల్లో సూదిమొనంత కూడా మార్పు రాలేదు. విభజనకు ముందు తరవాత అన్న అధ్యయనం జరగాల్సి ఉంది. తెలంగాణలో కెసిఆర్ నిర్వాకం వల్ల కాళేశ్వరం, సచివాలయం, ప్రగతి భవన్‌ల నిర్మాణాలతో వేలకోట్లు దుర్వినియోగం చేశారు.
ఆయనతో పాటు, వారి అనుయాయుల పొలాలకు నీళ్లు చేరేలా కాళేశ్వరం డిజైన్ చేసుకున్నారు. ఎందరో రైతులను, గ్రామస్థులను తన అవసరాల కోసం రోడ్డున పడేశారు. తన సుఖాల కోసం ప్రగతిభవన్ నిర్మించుకున్నారు. తనకోసం సచివాలయం నిర్మించుకున్నారు. ఎంతో పచ్చదనంతో కొత్తకొత్త భవనాలతో ఉన్న సచివాలయాన్ని నేలమట్టం చేసి, రాచరిక పోకడలను చాటుకున్నారు. మనం కోరుకున్న తెలంగాణ ఇదేనా అన్న చర్చ చేయాలి. ఇలాంటి రాచరిక పోకడలు ఉన్న వారి కారణంగా దేశ సంపద ఎలా దుర్వినియోగం అవుతందో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పాలనను ఉదాహరణగా చూడాలి. కొత్తగా ఉద్యోగాలు రాలేదు. కొత్తగా ఉపాధి రాలేదు. కొత్తగా నీళ్లు రాలేదు. పథకాలన్నీ పందేరం చేసేందుకు ఉపయోగించిన ఘనుడు మన కెసిఆర్. అన్నను మించిన తమ్ముడిలా జగన్ కూడా లక్షల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. రాజధాని లేదు.
పోలవరం పూర్తి చేయలేదు. రోడ్లు వేయలేదు. కానీ విలాసవంతమైన భవనాలు నిర్మించు కున్నారు. తనో అపర నిజాంలా వ్యవహరించి ప్యాలెస్‌లు కట్టుకున్నారు. తాజాగా బయటపడ్డ విశాఖలోని రుషికొండ ప్యాలెస్ వెనుక మరెన్నో విషయాలు దాగున్నాయి. తన పాలనా కాలంలో రుషికొండను తొలిచేశారు. అటువైపు చీమకూడా వెళ్లకుండా కట్టుబాట్లు పెట్టి, ప్యాలెస్ నిర్మించుకున్నారు. మళ్లీ నేనే సిఎం..విశాఖలోనే ప్రమాణం అని ప్రచారం చేసుకున్న జగన్ ఇంతగా అధికార, దుర్వినియోగం, నిధుల దుర్వినియోగం చేసిన తీరు ఆశ్చర్యం కలిగించక మానదు. ఇలాంటి కట్టడాలు ఇంకా ఉన్నాయా..అన్న అనుమానాలు వస్తున్నాయి. రుషికొండ ప్యాలెస్‌కు ఎంత ఖర్చు చేశారు.. దేనికి ఖర్చు చేశారు అనే విషయాలకు సంబంధించి లెక్కలు బయటకు రావాల్సి ఉంది. దీనిపై సిఎం చంద్రబాబు ఇప్పటికే నివేదిక కోరారు. పూర్తి వివరాలు వచ్చిన తరువాత ప్రజల ముందు బహిర్గతం అవుతాయి.
రాష్ట్రాన్ని తన ఇష్టం వచ్చినట్లుగా జగన్ పాలించచారు. గంజాయి, అక్రమ మద్యం పెరిగింది. వీటివల్ల నష్టపోయిన కుటుంబాల గోడును ఏనాడూ పట్టించుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎప్పుడూ లేనంతగా గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం పెరిగింది. రుషికొండపై రాజమహల్ తరహాలో భవనాలను అత్యంత ఖరీదుగా ప్రత్యేకంగా నిర్మించిన తీరుత ఇప్పుడు ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేస్తోంది. ఏడు భవనాల్లో మూడు ప్రత్యేకంగా జగన్ కుటుంబం కోసమే తీర్చిదిద్దారని చెప్పుకుంటున్నారు. అక్కడ ఈ మూడిరటికి మాత్రమే సముద్ర తీరంచూసేలా వ్యూ ఉంది. మిగిలిన వాటికి ఎదురుగా బీచ్‌రోడ్డు, గీతం కాలేజీ కనిపిస్తాయి. జగన్ కుటుంబం కోసం నిర్మించిన భవనాల్లో బాల్కనీలోకి వచ్చినా, బాత్‌రూమ్‌లో నుంచైనా కిటికీల నుంచి సముద్రం కనిపించేలా డిజైన్ చేసుకున్నారు. అలాగే మసాజ్ కోసం ప్రత్యేకంగా ఒక గది ఏర్పాటు చేసుకున్నారు.
దానికి ’స్పా రూమ్’ అని పేరు పెట్టుకున్నారు. ఇవన్నీ గ్రౌండ్ ప్లస్ వన్ నిర్మాణాలుగా గుర్తించారు. విజయనగర`1 భవనం జగన్, భారతీల కోసం నిర్మించారు. అందులో నాలుగు పడక గదులు ఉన్నాయి. మిగిలిన రెండు భవనాలు చెరో కుమార్తె కోసం ఉద్దేశించినవని చెప్పుకుంటున్నారు. వాటిలో కూడా నాలుగేసి పడక గదులు, విశాలమైన సమావేశ మందిరాలు ఉన్నాయి. ఈ మూడు భవనాలను, మిగిలిన నాలుగింటికి దూరంగా సముద్రానికి అభిముఖంగా నిర్మించారు. వీటికి ప్రత్యేకంగా పెద్దగేటు ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవరికీ అటువైపు ప్రవేశం లేకుండా చేశారు. పిడుగులు పడినా చెక్కు చెదరకుండా ఏర్పాట్లు ఉన్నాయి. వీటిలో బాత్‌రూమ్ టబ్ ఒక్కొక్కటి రూ.26 లక్షలని చెబుతున్నారు. ఇంటర్నేషనల్ బ్రాండ్ టోటో కంపెనీకి చెందిన బాత్‌రూమ్ ఫిటింగ్స్ వినియోగించారు.
ఇలాంటివన్నీ పర్యాటకుల కోసమేనా?...అని వైసీపీ నేతలను ప్రశ్నిస్తే... సమాధానం చెప్పకుండా అవి ప్రభుత్వ భవనాలే కదా? అంటున్నారు తప్పితే..అంత ఖర్చు ఎందుకు చేశారో చెప్పడం లేదు. విశాఖలో రుషికొండ రాజభవనాన్ని జగన్ ప్రభుత్వ ఆడంబారాలకు నిదర్శనంగా చూడాలి. ఖర్చును వృథా చేసి అడంబరంగా కట్టుకున్న తీరు రాజరకి పోకడలను గుర్తు చేస్తోంది. తాజాగా. రుషికొండ భవనం ఫొటోలు, వీడియోలు సోషల్ విూడియాలో వైరల్ అవుతున్న తీరు చూసి ప్రపంచం ముక్కున వేలేసుకుంది. రుషికొండ భవన నిర్మాణంపై ముందునుంచీ దాగుడుమూతలు సాగాయి. మొదట టూరిజం ప్రాజెక్ట్ అన్నారు. తర్వాత ఫైవ్ స్టార్ హోటల్ అన్నారు. ఆ పైన సీఎం క్యాంప్ ఆఫీస్ అన్నారు. ప్రభుత్వ నిర్మాణమైనా, ప్రైవేట్ నిర్మాణమైనా వివరాలను ఆ కట్టడం దగ్గర ప్రదర్శిస్తారు.
సెక్యూరిటీ కారణాల వల్ల అలా చేయలేదని ఇప్పుడు సమర్ధించు కోవడం విడ్డూరంగా ఉంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్ బస చేయడానికి ఐ.ఎన్.ఎస్. డేగ, నేవల్ గెస్ట్ హౌస్ వంటి నిర్దిష్ట విడిది ప్రాంతాలు ఉన్నాయి. వి.వి.ఐ.పి.లు ఉండే భవనాలు కావడం వల్ల రుషికొండ విూద ఏం కడుతున్నామో చెప్పలేక పోయామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనడం హాస్యాస్పదం. సరైన అనుమతులు లేవని ప్రభుత్వమే నిర్మించిన ప్రజా వేదికను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. మరి గ్రీన్ ట్రిబ్యునల్ మొదలు అనేక అభ్యంతరాలున్న రుషికొండ భవనాన్ని ఏం చెయ్యాలన్నా సవాలక్ష ప్రశ్నలు వస్తున్నాయి.
నిజంగా ఇదంతా విభజన పాపం వల్ల , నేతలపై కట్టుబాట్లు లేకపోవడం వల్ల జరిగిన దుర్వినియోగంగా చూడాలి. వెరసి ఎపి రెండు రాష్ట్రాలుగా విడిపోయి, నేతల అవినీతి కారణంగా అప్పులకుప్పగా మారింది. దీనిపై నిజంగానే ప్రత్యేకంగా కమిషన్ వేసి విచారణ చేసి, అవినీతికి పాల్పడి, అప్పులు చేసిన నేతలను బోను ఎక్కించాలి. ఇకముందు ఇలాంటి అకృత్యాలకు పాల్పడకుండా చట్టబద్ద చర్యలకు పూనుకోవాలి.