18-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 18: తెలుగుదేశం నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పేదలకు ఇచ్చే రేషన్‌ను ఇక మరింత పకడ్బందీగా చేయాలని ఆలోచిస్తోంది. అధికారంలోకి వచ్చి రాగానే తెల్లరేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏడాది నుంచి కందిపప్పు పంపిణీని నిలిపివేసింది. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి కందిపప్పుతో పాటు పంచదార సరఫరా చేయాలని భావిస్తోంది. కందిపప్పును వైసీపీ ప్రభుత్వం నిలిపివేయడంతో సామాన్యులు ఏడాది నుంచి బహిరంగ మార్కెట్లలో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. తమ ప్రభుత్వం పేదలు, లబ్దిదారులతో పాటు అన్ని వర్గాల వారికి సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి పెట్టనుందని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలో రేషన్ షాపుల ద్వారా కందిపప్పు ఇవ్వడం లేదని ఆరోపణలు వచ్చాయి.
మార్కెట్‌లో దరలు పెరిగినందను పేదలకు అందుబాటులో నిత్యావసరాలు తీసుకుని వచ్చే క్రమంలో మరిన్ని సరుకులు అందించే ఆలోచన చేస్తున్నారు. ఇందుకు డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. సత్వరమే సరఫరా మొదలుపెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ అధికారులు కదిలారు. కందిపప్పును కొనుగోలు చేసి ఎంఎల్‌ఎస్ పాయింట్లకు తరలిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి బియ్యం, కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్లు, పంచదారను రేషన్ షాపులకు సరఫరా చేయాల్సి ఉంది. జులై 1వ తేదీ నుంచి తెల్లరేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు కందిపప్పు, పంచదారను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంఎల్‌ఎస్ పాయింట్ లోకి వచ్చిన కందిపప్పు, చక్కెరతో పాటు అక్కడి సరుకుల నాణ్యతను అధికారులు పరిశీలిస్తున్నారు.
ప్రీ ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల మనోహర్ రెండు రోజుల కిందట తెనాలిలో తనిఖీలు చేపట్టారు. అంగన్‌వాడీలకు ఇచ్చే కందిపప్పు, నూనెతో పాటు వైట్ రేషన్ కార్డుదారులకు ఇచ్చే పంచదారలో ఎక్కడ చూసిన తక్కువ తూకంతో సరుకులు పంపిణీ జరుగుతోందని గుర్తించారు. కందిపప్పు, నూనె అయితే 50 నుంచి 100 గ్రాములు తక్కువ ఉందని నిల్వ గోదాములను తనిఖీ చేసినప్పుడు వెల్లడైంది. అనంతరం మంగళగిరిలోనూ మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీలు చేయించారు. అక్కడ సైతం నిర్దేశిత పరిమాణం కంటే తక్కువ తూకంతో పంపిణీ జరుగుతున్నట్లు తేలింది. ఈ క్రమంలో ఏపీ వ్యాప్తంగా కందిపప్పు, పంచదార, నూనె ప్యాకెట్ల పంపిణీ నిలిపేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించడం తెలిసిందే. ఈ అవకతవకలు జరగడానికి కారణాలపై రెండు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఈ నెల రేషన్ లో సరుకుల జాబితాను సిద్దం చేయబోతున్నారు.