18-06-2024 RJ
తెలంగాణ
యాదగిరిగుట్ట, జూన్ 18: యాదగిరి గుట్టలో గిరి ప్రదక్షిణకు ఉన్న డిమాండ్‌తో మళ్లీ దానిని ప్రవేశ పెట్టే ఆలోచనలో ఆలయ అధికారులు ఉన్నారు. ఈ దివ్యక్షేత్రాన్ని దేశంలోని ఇతర దివ్యక్షేత్రాల్లోని మరే ఆలయానికీ తీసిపోని రీతిలో వివిధ శిల్పకళా శైలుల వైభవం ఒకేచోట భక్తులకు కనువిందు చేసేలా అత్యంత అపురూపంగా పునర్నిర్మించారు. ఆలయ ఆలయ పునర్ నిర్మాణంతో గిరి ప్రదక్షణ చేసేందుకు భక్తులకు ఇబ్బందికరంగా మారింది. ఇటీవల రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడగానే యాదగిరిగుట్టలో ఉన్న పాత ఆచారాలను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది. గిరి ప్రదక్షిణ అనగానే మనకు గుర్తుకువచ్చేది 14 కిలోవిూటర్ల అరుణాచల గిరిప్రదక్షిణ. మహిమాన్విత స్వయంభు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని భక్తులు గిరిప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శించుకోవడం ఏళ్లుగా సంప్రదాయంగా కొనసాగుతోంది.
ఈ యాదాద్రి గిరి ప్రదక్షణకు కూడా అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. యాదగిరిగుట్ట కొండపై జ్వాలా నారసింహుడు, గండభేరుండ నారసింహుడు, యోగ నారసింహుడు, ఉగ్ర నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు స్వయంభువులుగా వెలసిన పంచ నారసింహ క్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి. ఎన్నో ఏళ్లుగా స్థానిక భక్తులు మాత్రమే గిరిప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శించుకోవడం జరుగుతోంది. అయితే 2016లో కోట్లాది రూపాయలతో ఆలయాన్ని పునర్నిర్మించారు. ఇందులో బాగానే కొండపై స్వామివారి సన్నిధిలో భక్తులకు బస చేసే అవకాశం, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకోవడం, కొండపైకి ఆటోలను అనుమతించడం వంటి అంశాలను పునరుద్ధరించింది.