18-06-2024 RJ
సినీ స్క్రీన్
కుటుంబంతో కలిసి చూసే సినిమాల్లో నటించడమే నా లక్ష్యం అని అంటోంది బాలీవుడ్ భామ కియారా అడ్వాణీ. ’ఫగ్లీ’తో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ అందాల తార.. తన నటనతో తెలుగు ప్రేక్షకులనూ మెప్పించింది. త్వరలో ’గేమ్‌ఛేంజర్’తో రావడానికి సిద్ధమవుతున్న కియార.. హిందీ పరిశ్రమలో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తన అనుభవాలను పంచుకుంటూ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ‘నటిగా ఎదగాలనే లక్ష్యంతో నాకు 21ఏళ్లు ఉన్నప్పుడు సినీ కెరీర్‌ను ప్రారంభించాను. అప్పుడు నేనేం చేస్తున్నానో.. ప్రేక్షకులకు ఎలా దగ్గరవ్వాలో కూడా తెలియదు. ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలో అవగాహన లేదు.
కానీ నా పదేళ్ల ప్రయాణంలో జీవితంలో ఎలా పైకి ఎదగాలో నేర్చుకున్నాను. పాత్రలు, కథల ఎంపికలో మార్పులు చేస్తూ.. కుటుంబంతో కలిసి చూసేలా సినిమాలు తీయాలని నిర్ణయించు కున్నాను. ఇప్పుడిదే నా లక్ష్యం. ఈ ప్రయాణంలో ఎన్నో మరువలేని జ్ఞాపకాలను పోగుచేసుకున్నాను. ఇప్పటికీ రోజూ కొత్తగానే అనిపిస్తుంటుంది. ప్రేమ, కలలు, చిరునవ్వులు, కన్నీళ్లు.. ఇలా ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నాను. నా లక్ష్యాన్ని సాధించడానికి సహకరించిన దర్శకులకు, సహనటులకు, అభిమానులకు కృతజ్ఞతలు‘ అని చెప్పుకొచ్చింది కియార.