18-06-2024 RJ
సినీ స్క్రీన్
’మిస్టర్ బచ్చన్’గా సినీప్రియుల్ని పలకరించనున్నారు రవితేజ. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాని హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. జగపతిబాబు ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం నుంచి షో రీల్ పేరుతో ఓ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. దాదాపు నిమిషం నిడివి ఉన్న ఈ ప్రచార చిత్రంలో ఒక్క డైలాగ్ లేకున్నా.. రవితేజ ఆద్యంతం మాస్ యాక్షన్ హంగామాతో అలరించారు. ఆయన ఇందులో నిజాయతీ గల ఆదాయపన్ను అధికారిగా కనిపించనున్నట్లు అర్థమవుతోంది.
తను ఓ రాజకీయ నాయకుడి ఇంటికి రైడ్‌కు వెళ్లాక ఏం జరిగిందనే ఆసక్తికర అంశంతో ఈ సినిమా రూపొందించినట్లు తెలుస్తోంది. ఆఖర్లో అమితాబ్ కటౌట్ ముందు ఆయన్ని అనుకరిస్తూ రవితేజ కనిపించిన తీరు ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు ముగింపు దశలో ఉన్నాయి. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నారు. ఈ సినిమాకి సంగీతం: మిక్కీ జె.మేయర్, ఛాయాగ్రహణం: అయనంక బోస్.