18-06-2024 RJ
సినీ స్క్రీన్
మలయాళం సూపర్ స్టార్ ఫహాద్ ఫాజిల్ ’పుష్ప 2’ లో ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ముందు ’పుష్ప’ లో ఫహాద్ ఫాజిల్ కనిపించారు, ఇప్పుడు ఈ సీక్వెల్ లో అతని పాత్ర నిడివి ఇంకా ఎక్కువ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 15 న విడుదల కావాల్సి వుంది, కానీ ఇప్పుడు డిసెంబర్ 6 కి వాయిదా పడిరది. అయితే ఇంత దూరం వాయిదా పడటంతో అయితే ఇంత దూరం వాయిదా పడటంతో అల్లు అర్జున్ అభిమానులు కొంచెం అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ విషయానికి వస్తే అతను మలయాళంలో చేసిన సినిమా ’ఆవేశం’ చాలా పెద్ద విజ్జయం సాధించటమే కాకుండా, వంద కోట్ల క్లబ్బులోకి చేరింది కూడా. మలయాళం పరిశ్రమలో ఫహాద్ ఫాజిల్ ఇప్పుడు పెద్ద సూపర్ స్టార్ అయిపోయారు.
మరి అటువంటి సూపర్ స్టార్ తెలుగు సినిమా ’పుష్ప 2’ కి తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలిస్తే షాకవుతారు. ఫహాద్ ఫాజిల్ ఈ సినిమా కోసం రోజువారీ పారితోషికం తీసుకుంటారని తెలుస్తోంది. అతను రోజుకి రూ.12.50 లక్షలు పారితోషికం తీసుకుంటారని సమాచారం. ఈ షెడ్యూల్ లో సుమారు నెల రోజులపాటు తన తేదీలను ఈ సినిమా కోసం కేటాయించారు ఫహాద్ ఫాజిల్. ఇంతకు ముందు కూడా చాలా రోజులు ఈ సినిమా కోసం కేటాయించారు. గత రెండు సంవత్సరాల నుండి ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది, కానీ ఇంకా పూర్తి కాలేదు. అయితే ఇక్కడే ఇంకొక ట్విస్టు కూడా వుంది. ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాకి కేటాయించిన తేదీలలో ఒకవేళ చిత్రీకరణ ఎటువంటి పరిస్థితుల్లో అతనితో చెయ్యకపోయినా, చిత్రీకరణ ఆగిపోయినా ఫహాద్ ఫాజిల్ కి పారితోషికం ముట్ట చెప్పాల్సిందే.
అదే తెలుగు క్యారెక్టర్ నటులైతే, ఒకవేళ చిత్రీకరణ కాన్సుల్ అయితే ఆరోజు పారితోషికం ఇవ్వరు, కానీ ఫహాద్ ఫాజిల్ కి అలా కాదు, అతనికి ఇవ్వాల్సిందే. అదీ అతని డిమాండ్. చాలాసార్లు అతను ఇచ్చిన తేదీల్లో చిత్రీకరణ జరగని సంఘటనలు కూడా ఉన్నాయి, అయినా కూడా అతనికి పారితోషికం చెల్లించారు. తెలుగు ఫిల్మ్ మేకర్స్ కి తెలుగు క్యారెక్టర్ నటులంటే అంత చిన్నచూపు, పరభాషా నటులంటే వారు పెట్టిన షరతులు అన్నిటికీ తలవొగ్గి మరీ తీసుకుంటారు.