18-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 18: ప్రస్తుతం ఐటీఐల్లో విద్యార్థులకు నేర్పించే నైపుణ్యాలు ఉపయోగం లేకుండా పోయాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. 50 ఏళ్ల నాటి నైపుణ్యాలను ఐటీఐల్లో నేర్పిస్తున్నారని, అప్ గ్రేడ్ కావాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీఐలను ఐటీసీలుగా మారుస్తున్నామని ప్రకటించారు. ఇందుకోసం టాటా సంస్థ సహకారం తీసుకుంటున్నామని వెల్లడించారు. విద్యార్థులు, నిరుద్యోగులను నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానని వివరించారు. తన ఆలోచనల నుంచి వచ్చిందే ఏటీసీ సెంటర్స్ అని పేర్కొన్నారు. మేం పాలకులు, విూరు బానిసలు అనే ఆలోచన లేదు. మేం సేవకులం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 40 లక్షల మంది యువతీ యువకులు ఉపాధి లేక రిక్రూట్‌మెంట్ బోర్డుల చుట్టూ తిరుగుతున్నారు. సర్టిఫికెట్ ఉంటే సరిపోదు సాంకేతిక నైపుణ్యం ఉండాలి. సాంకేతిక నైపుణ్యం ఉంటే ఉపాధి లభిస్తుందని విశ్వసిస్తానని అన్నారు. సర్టిఫికెట్స్ జీవన ప్రమాణాలు పెంచవు.
గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్లకుండా ప్రభుత్వం ఉపాధి గ్యారంటీ ఇస్తుంది. టాటా సంస్థ సహకారంతో సాంకేతిక నైపుణ్యాల కోసం రూ.2,324 కోట్లతో 65 ఐటీఐలు ఐటీసీలుగా మారుస్తున్నాం. విద్యార్థుల శిక్షణ కోసం ముందుకు వచ్చిన టాటా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఐటీ రంగంలో ప్రపంచంలో తెలుగు వారు పోటీ పడుతున్నారు. మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించడమే మా బాధ్యతని అన్నారు. రాష్ట్రంలో గల 65 ఐటీఐలను అధునాతనంగా తీర్చిదిద్దుతాం. నైపుణ్యాలను నేర్పించి నిరుద్యోగులకు భరోసా కల్పిస్తాం. విద్యార్థిని విద్యార్థులు ఐటీఐల్లో చేరాలి. ఈ శాఖ తన వద్ద ఉంటుంది. నేనే స్వయంగా పర్యవేక్షిస్తా. ప్రతి నెలా సవిూక్ష నిర్వహిస్తా అని’ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో ఐటీఐ స్కిల్ డెవలప్‌మెంట్ అప్ గ్రేడేషన్ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కలిసి భూమి పూజ చేశారు.
ఈ కార్యక్రమంలో టాటా టెక్నాలజీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా యువతను తీర్చిదిద్దేందుకుగానూ ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ఏటీసీ) మార్చాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఐటీఐలను ఏటీసీలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్‌తో పదేళ్లకుగానూ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేస్తారు. ఆధునిక పరిశ్రమలకు అవసరాలకు అనుగుణంగా ఏటీసీల్లో యువతకు శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఏటీసీల్లో అధునాతన సామగ్రి, సాంకేతికత ఏర్పాటు చేస్తారు. శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణులను టీటీఎల్ నియమిస్తుంది.
ఏటీసీల్లో ఏటా 15,860 మందికి ఆరు రకాల దీర్ఘ కాల (లాంగ్ టర్మ్) కోర్సుల్లో, 31,200 మందికి 23 రకాల స్వల్ప కాలిక కోర్సుల్లో శిక్షణ అందిస్తారు. గత పదేళ్లలో రాష్ట్రంలోని ఐటీఐల్లో కేవలం 1.5 లక్షల మంది మాత్రమే శిక్షణ పొందారు. ఈ ఏటీసీలతో రానున్న పదేళ్లలో నాలుగు లక్షల మంది శిక్షణ పొందుతారు. ఐటీఐలను ఏటీసీలుగా మార్చే ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.2,324.21 కోట్లు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.307.96 కోట్లు (13.26 శాతం) కాగా టీటీఎల్ వాటా రూ.2016.25 కోట్లు (86.74). ఏటీసీలు కేవలం వివిధ కోర్సుల్లో శిక్షణకే పరిమితం కాకుండా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా పని చేస్తాయి. అలాగే ఈ ఏటీసీలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమలకు సాంకేతిక కేంద్రాలుగానూ (టెక్నాలజీ హబ్) పని చేస్తాయి. ఏటీసీల్లో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి టీటీఎల్ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. ఏటీసీలు భవిష్యత్తులో తమ సేవలను పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థులకు అందజేస్తాయని అధికారులు తెలిపారు.