18-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 18: ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి సచివాలయం వేదిక అయ్యింది. బుధవారం నాడు డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఇవాళ సెక్రటేరియట్‌కు వెళ్లి చాంబర్‌ను చూడటం, సంబంధిత శాఖ ఉన్నతాధికారులను పవన్ పరిచయం చేసుకున్నారు. సుమారు గంటన్నరపాటు సెక్రటేరియట్‌లో గడిపిన సేనాని.. రెండో బ్లాక్‌లో ఉన్న తన చాంబర్‌ను నిశితంగా పరిశీలించారు. అనంతరం మొదటి బ్లాక్‌కు వెళ్లిన పవన్.. సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎంకు సాదర స్వాగతం పలికిన సీఎం, ఆలింగనం చేసుకున్నారు. అనంతరం పేషీలో కూర్చోని సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. భేటీ కావడానికి వచ్చిన పవన్‌కు సీటులో నుంచి లేచి ఎదురెళ్లి మరీ.. ఆలింగనం చేసుకున్న సీఎం స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా.. సీఎం చాంబర్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక చిహ్నం చూపించిన పవన్.. ’విూరు ఆ గుర్తుకు హుందాతనం తెచ్చారు సార్’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు చంద్రబాబు స్పందిస్తూ ’ధన్యవాదాలు పవన్’ అని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత తొలిభేటీ కావడంతో ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రేపు బాధ్యతలు తీసుకోనున్న విషయంపై కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ భేటీలో పవన్‌తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా ఉన్నారు. సచివాలయంలోకి మునుపెన్నడూ రాని పవన్ కల్యాణ్.. కూటమి ప్రభుత్వం ఏర్పడటం, డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సచివాలయం వెళ్లే దారులు మొదలుకుని లోపలికి అడుగుపెట్టేంతవరకూ అడగడుగునా ఘన స్వాగతం పలికారు. పవన్‌కు అమరావతి రైతులు, మహిళలు అపూర్వ స్వాగతం పలికారు. దారి పొడవునా పూలాభిషేకంతో ఆహ్వానించారు.
మందడంలో చెక్కతో చేసిన నాగలిని పవన్‌కు కానుకగా రైతులు చేశారు. అనంతరం సచివాలయంకు వెళ్లిన పవన్‌కు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన డిప్యూటీ సీఎం.. సచివాలయంలో సెకండ్ బ్లాక్‌కు వెళ్లి తన చాంబర్‌ను పరిశీలించారు. తొలుత అధికారులను పరిచయం చేసుకున్న పవన్.. ఆ తర్వాత మంత్రులు నాదెండ్ల, కందుల దుర్గేష్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఈ ముగ్గురూ కలిసి సీఎం చంద్రబాబు చాంబర్‌కు వెళ్లి సమావేశమయ్యారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కోసం విజయవాడలో క్యాంపు కార్యాలయం సిద్ధమవుతోంది. మంగళవారం ఆయన పరిశీలించి అంగీకారం తెలిపారు. ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన.. నేరుగా విజయవాడలోని జలవనరులశాఖ అతిథిగృహం వద్దకు వెళ్లారు. డిప్యూటీ సీఎంకు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయితో కలిసి ఆ భవనాన్ని పవన్ పరిశీలించారు. పైఅంతస్తులో నివాసం.. కింది అంతస్తులో కార్యాలయం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. పక్కనే సమావేశమందిరం అందుబాటులో ఉండటంతో ఈ భవనంలో ఉండేందుకు పవన్ అంగీకరించినట్లు సమాచారం. అధికారులకు ఆయన కొన్ని మార్పులు సూచించారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయానికి బయల్దేరి వెళ్లారు.