18-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 18: ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు ఈనెల 21, 22 తేదీల్లో జరుగనున్నాయని సంబంధిత అధికారులు వెల్లడిరచారు. ఈ నెల 24 నుంచి జరుగుతాయని ప్రకటించి నప్పటికీని సమావేశాల తేదీని ముందుకు జరిపారు. సమావేశాల మొదటి రోజు కొత్తగా ఎన్నికైన 175 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం, మరుసటి రోజు శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగనుందని తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రెండోసారి పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన అనంతరం 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పోటీ చేసి మొదటి సారి అధికారంలో రాగా 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఒంటిరిగా పోటీచేసి ఓడిపోయింది.
వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం 175కు 151 స్థానాలు కైవసం చేసుకుని రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టింది. టీడీపీ 23 స్థానాలతో, జనసేన ఒక స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి రెండో సారి పోటీ చేసి అనూహ్య ఫలితాలను సాధించింది. 164 స్థానాల్లో కూటమి గెలుపొందగా వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమై ప్రతిపక్ష హోదాను కోల్పోయింది.