19-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 19: ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ఉదయం 10 గంటల 47 నిమిషాలకు బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజల తర్వాత బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పవన్‌కు ఇంద్రకీలాద్రి దేవస్ధాన వేదపండితుల ఆశీర్వచనాలు అందించారు. బాధ్యతలు స్వీకరించగానే పలు ఫైళ్లపైన పవన్ సంతకాలు చేశారు. పవన్ కల్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటుగా పంచాయతీరాజ్, గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఇందుకు సంబంధించిన అధికారిక పత్రాలపై ఆయన సంతకం చేశారు.
దీంతో డీప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రావిూణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించినట్టయింది.జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విజయవాడ చేరుకున్న ఆయన క్యాంపు కార్యాలయంలోకి ఉప ముఖ్యమంత్రిగా తొలిసారి అడుగు పెట్టారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. పలు శాఖల అధికారులతో పాటు పలువురు మంత్రి, పవన్ సోదరుడు నాగబాబు అభినందనలు తెలిపారు.