19-06-2024 RJ
సినీ స్క్రీన్
దర్శకుడు హరీష్ శంకర్ తన మిత్రుడు రవితేజ కాంబినేషన్ లో ’మిష్టర్ బచ్చన్’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పుడు చివరి దశకు చేరుకున్నట్టుగా కనపడుతోంది. కేవలం పాటలు మాత్రమే చిత్రీకరించాల్సి ఉన్న ఈ సినిమా, ఆ పాటల కోసం సినిమా యూనిట్ కాశ్మీర్ చేరుకున్నారు. అక్కడ అందమైన ప్రదేశాలలో హరీష్ శంకర్ పాటల చిత్రీకరణ చేయనున్నారు. తన సామాజిక మాధ్యమం అయిన ’ఎక్స్’ లో హరీష్ శంకర్ ఈ చిత్రంపై కొన్ని పోస్టులు పెట్టారు. అందులో కాశ్మీర్ లో ఉన్నట్టు చూపించిన కొన్ని ప్రదేశాల బోర్డులను ’ఎక్స్’ లో పోస్టు చేస్తూ చాలా ఉత్సాహంగా వున్నట్టుగా చెప్పారు. అలాగే తాను చిత్రీకరణ చెయ్యబోయే పాటలోని కొన్ని చరణాలను కూడా హరీష్ శంకర్ పోస్టు చేశారు. సాహితి గారు రాసిన ఈ పాటని చిత్రీకరణ చెయ్యడానికి ఎంతో ఉత్తేజంగా వుంది అని చెప్పారు హరీష్ శంకర్. ఇంతకు ముందు సాహితి గారు తన సినిమాలకి రాసిన పాటలని కూడా గుర్తు చేశారు.
గబ్బర్ సింగ్ సినిమాలో రాసిన కెవ్వు కేక.. పాట, అలాగే ’దువ్వాడ జగన్నాధం’ సినిమాకి రాసిన అస్మైక యోగ... పాట అప్పట్లో పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. ’మిష్టర్ బచ్చన్’ సినిమా నుండి షో రీల్ అని ఒక ప్రచార వీడియోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఒక్క మాట కూడా వినపడకుండా, కేవలం నేపధ్య సంగీతంతో వుండే ఆ వీడియోకి మంచి ప్రశంశలు వచ్చిన సంగతి తెలిసిందే. పరిశ్రమలో చాలామంది దర్శకులు, మిగతా వాళ్ళు ఆ షో రీల్ గురించి చాలా బాగా మాట్లాడటమే కాకుండా, హరీష్ ని ప్రశంశించారు కూడా. రవితేజ పక్కన భాగ్యశ్రీ బోర్సే అనే అమ్మాయిని తెలుగు తెరకి పరిచయం చేస్తున్నారు హరీష్ శంకర్. అజయ్ దేవగన్ నటించిన ’రైడ్’ అనే సినిమాని హరీష్ శంకర్ ’మిస్టర్ బచ్చన్’ గా తెరకెక్కిస్తున్నారు. హిందీలో సౌరభ్ శుక్ల చేసిన పాత్రని, తెలుగులో జగపతి బాబు చేస్తున్నారు, ప్రధాన విలన్ గా నటిస్తున్నారు.