20-06-2024 RJ
తెలంగాణ
నిజామాబాద్, జూన్ 20: ప్రైవేటు పాఠశాలల తీరుపై విద్యాశాఖ అధికారుల్లో పూర్తిగా నిర్లక్ష్యం కనిపిస్తోంది. కనీస వసతులు కరవైనా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఫీజుల విషయంలో ఇప్పటికే విద్యార్థి సంఘాలు పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. వాటి నియంత్రణ దిశగా కనీస చర్యలకు చేపట్టలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బడి ఆవరణలో ఎట్టిపరిస్థితుల్లో విద్యను వ్యాపారం చేసేలా పుస్తకాలు, ఏకరూప దుస్తులను విక్రయించవద్దనే నిబంధనను ఉల్లంఘిస్తున్నా..చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అనుమతులు సహా ఇతర వ్యవహారాల్లోనూ పర్యవేక్షణ కొనసాగించడం లేదు. కవిూషన్లతో వ్యాపారం .. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ఆయా పుస్తక విక్రయ దుకాణాలతో ముందస్తు ఒప్పందాన్ని కుదుర్చు కుంటున్నాయి. కొన్ని ప్రైవేటు బడుల్లో ఫీజులుం కొనసాగుతోంది. వసతులు, సౌకర్యాలు ఎలా ఉన్నా నాణ్యమైన విద్య ముసుగులో అక్రమార్జనకు కొన్ని పాఠశాలలు తెరతీస్తున్నాయి. బడుల్లో పుస్తకాలు, ఏకరూప దుస్తులను విక్రయించవద్దని.. ప్రభుత్వం, న్యాయస్థానం ఆదేశించినా జిల్లాలో ఆ వ్యవహారం బాహాటంగానే సాగుతోంది.
కాసుల కక్కుర్తితో బడిలో వ్యాపారం నడుస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు వారు చెప్పిన ఫీజును కాదనలేక.. పుస్తకాలను మరో చోట కొనలేక నానాతంటాలు పడుతున్నారు. ఎల్‌కేజీ విద్యార్థి పుస్తకాలకే రెండువేల వరకు ఖర్చవుతోంది. ఇక కెజీ పెరిగిన కొద్దీ రకరకాల పుస్తకాలు కావాలంటే జేబు గుల్లకాక తప్పడంలేదు. వీటికితోడుగా రాత కోసం మరో 10 నోటు పుస్తకాలను కొనాల్సిందే. బడికి బస్సులోనే పంపాలి. ఇందుకోసం నెలకు రవాణా రుసుం కట్టాలి. పుస్తకాలకు డ్రెస్‌లకు మరో రెండు వేలు, బెల్టు, బ్యాగు, బూట్లు ఇతర నోటు పుస్తకాలకు మరో మూడువేలు వసూల చేస్తున్నారు. పిల్లలుఫలానా షాపులోనే ఇవన్నీ కొనే విధంగా రహస్య ఒప్పందాలు కొందరు కుదుర్చుకున్నట్లు సమాచారం. పుస్తక దుకాణాల వారే అధికంగా అన్ని పాఠశాలలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఒక్కో పాఠశాల నుంచి సుమారు 400 నుంచి 1200 మంది పిల్లలు ఉంటున్నారు. ఇలా వారి సంఖ్యను బట్టి బడులకు కవిూషన్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లలకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలన్నీ అక్కడే కొనాలే నిబంధనను పెడుతున్నారు.
దీంతో విధిలేని పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు వారి చెప్పిన ధరలకే తీసుకోవాల్సి వస్తోంది. ఇలా జిల్లా వ్యాప్తంగా కొన్ని విద్యాసంస్థలు కోట్ల రూపాయల్లో లావాదేవీలు చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఒక్కో బడిలో ఒక్కో విధమైన ధరల్ని నిర్ణయించారు. తరగతుల వారీగా పాఠ్యపుస్తకాలతో పాటుగా నోటు పుస్తకాలను అమ్ముతున్నారు. ఏ ఒక్కటి తీసుకోకున్నా ఒప్పుకోవడం లేదు. పట్టణంలో ఒకటి రెండు బడులకు మినహాయిస్తే ఏ ఒక్క చోట విద్యార్థులు ఆడుకునేందుకు మైదానాలు లేవు. పైగా విద్యార్థులకు క్రీడల కోసం కొన్ని చోట్ల ప్రత్యేక ఫీజు వసూలు చేస్తున్నారు. మైదానం సంగతేంటని.. తల్లిదండ్రులు ప్రశ్నిస్తే వారంలో ఒక రోజు పట్టణశివారులో ఉన్న మైదానానికి పిల్లలను బస్సులో తీసుకెళ్తామనే సమాధానాలు వినిపిస్తున్నాయి.