20-06-2024 RJ
తెలంగాణ
వరంగల్, జూన్ 20: మిమిక్రీ అనే కళను ప్రపంచానికి పరిచయం చేసి, దానిని ఐక్యరాజ్య సమితి వరకు తీసుకెళ్లిన ధీశాలి మన నేరెళ్ల వేణుమాధవ్ ధన్యజీవి. అంతటి మహానుభావుడు ఓ సామాన్యుడిలా మన కళ్లముందే నడయాడి మనలను వీడి వెళ్లారు. జూన్ 19న ఆయన వర్ధంతి. ఆయన ప్రేమించి, ప్రవచించిన మిమిక్రీని సజీవంగా మనకందించారు. మిమిక్రీ ఉన్నన్నాళ్లూ నేరెళ్ల వేణుమాధవ్ మనకు సాక్షాత్కరిస్తూనే ఉంటారు. వరంగల్ నుంచి ప్రారంభమైన నేరెళ్ల వేణుమాధవ్ మిమిక్రీ ప్రస్థానం ఐరాస వరకు వెళ్లిందంటే తెలుగువారిగా మనకన్న గర్వించేవారు ఉండరు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కాలంలోనే అమెరికాలో ప్రదర్శనకు అవకాశం రావడంతో ఆయన పేరు దేశ వ్యాప్తంగా మార్మోగినప్పుడు తెలుగువారి గుండెలు మరింత పులకించి ఉంటాయి. ఆనాటి ఘటనలు తలుచుకుంటే నేటికీ మనం పులకించకుండా ఉండలేం. ఓ కళను సృష్టించిన స్రష్ట ఆయన. దానిని శబ్దప్రక్రియగా ఓ సబ్జక్టుగా రూపొందించి భావి తరాలకు మార్గం చూపారు.
అయినా పురాణాల్లోనే ఇలాంటి చాతుర్యం ఉందని, అదంత భగవత్ కృప అని చెప్పుకుని, తన గొప్పతనమేవిూ లేదని చెప్పుకోవడం ఆయన ఉదాత్తకు తార్కాణం. తనకు అబ్బిన మిమిక్రీ కళను ప్రపంచ వ్యాప్తంగా సుమారు 30 దేశాల్లో ప్రదర్శనలుగా ఇవ్వడం ఒక ఎత్తయితే 1971లో ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ ప్రముఖుల గొంతులను అనుకరించి ప్రపంచం దృష్టినీ ఆకర్షించడం మరొక ఎత్తు. తన గొంతులో వెయ్యి గొంతుకలను పలికించడం ద్వారా మిమిక్రీ కళను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన కళాకారుడు తెలుగువాడయినందుకు... భారతీయుడైనందుకు మనమంతా గర్వపడాలి. పదో ఏటలోనే మిమిక్రీ కళపై మక్కువ పెంచుకున్న నేరెళ్ల తన ఆశయం మేరకు మిమిక్రీపైనే దృష్టి సారించి దానిని జగద్విఖ్యాతం చేయకుండా ఉండివుంటే ఇవాళ మిమిక్రీ అన్నది ప్రపంచానికి తెలిసేది కాదు. ఆయన జీవితం ఓ పాఠం. ఆధునిక తరానికి ఓ సక్సెస్ స్టోరీ. పోతన పుట్టిన ఓరుగల్లులో పుట్టిన మట్టిబిడ్డగా వేణుమాధవ్ తన గళం బలంతో ప్రపంచాన్ని శాసించారు.
తొలితరం నటుడైన చిత్తూరు నాగయ్య స్వరాన్ని అనుకరించడం ద్వారా తన కళా ప్రస్థానానికి బాటలు వేసుకున్నది మొదలు ఆయన గొంతుకలో ఎందరి గొంతుకలు ఇమిడి పోయాయో చెప్పలేం. మహామహులే ఆయన గొంతుకకు పాదా క్రాంతులయ్యారు. ఉపాధ్యాయ వృత్తి చేపట్టినా..తనకు గుర్తింపు తెచ్చిన మిమిక్రీని మాత్రం వదలకుండా పెనవేసుకుని పోయారు. అలా మొదలైన ప్రస్థానం పది వేల ప్రదర్శనల వరకు కొనసాగిందంటే ఆయన పట్టుదల ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. మిమిక్రీకి ఏమాత్రం గుర్తింపు లేని రోజుల్లోనే ఆ కళపై మక్కువ పెంచుకుని దానికి అర్థం పరమార్థం చెప్పి ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి మన వేణు మాధవ్ ధన్యజీవి. ఆయన ప్రతిభాపాటవాలను గుర్తించిన భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. కాకతీయ విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూ, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్లు ఇచ్చి సత్కరించాయి. వివిధ రాష్టాల్లో ఆయన లెక్కలేనన్ని పురస్కారాలు, సత్కారాలు అందుకున్నారు. తిరుపతిలో అభిమానుల నుంచి గజారోహణ సత్కారం అందుకున్నారు.