20-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 20: రాష్ట్రంలోని నిరుద్యోగులు ధర్నాల బాట పట్టారు. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 పిలవాలని, గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ఇందిరా పార్కు వద్ద చేపట్టిన ఈ ధర్నాకు పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు మద్దతు తెలిపారు. గ్రూప్-2లో 2 వేల పోస్టులు, గ్రూప్-3లో 3 వేల పోస్టులకు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్-2, 3 రాతపరీక్షలను డిసెంబర్ వరకు వాయిదా వేయాలన్నారు. ఇక జీవో 46ను రద్దు చేయాలన్నారు. ధర్నాకు హాజరైన అభ్యర్థులు మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించి, వారి డిమాండ్లను నెరవేరుస్తామని రాహుల్ గాంధీ హావిూ ఇచ్చారని గుర్తు చేశారు.
కానీ ఇప్పుడు నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలు బల్మూర్ వెంకట్, చింతపండు నవీన్ కుమార్ ఇద్దరు ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఎన్నో హావిూలిచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీలు అయ్యాక నిరుద్యోగుల బాధలను పట్టించుకోవడం లేదని వాపోయారు. నిరుద్యోగుల సమస్యలపై వారిద్దరూ స్పందించడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి వంత పాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా, ఇప్పటి వరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ రాలేదన్నారు.