20-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 20: ఏపీ అంటే అమరావతి, పోలవరం అని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఈ రెండూ జీవనాడి అని అన్నారు. గురువారం అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడారు అమరావతి రైతులు 1631 రోజులు ఆందోళన చేశారు. ఈ సంఖ్య కలిపితే వైకాపాకు వచ్చిన సీట్లకు సరిపోలుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాజధాని పూర్తవుతుందనే నమ్మకంతో పోరాటాన్ని విరమించారు. రైతులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఏపీ అంటే అమరావతి, పోలవరం. ఎవరూ పక్క రాష్ట్రాలకు వలస వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ రాజధాని నిర్మాణం చేపట్టామని అన్నారు. పోలవరం పూర్తయితే రాష్ట్రం మొత్తానికి నీరు వస్తుందనే ఉద్దేశంతో దానిని పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చాం. పోలవరం పూర్తయితే రాయలసీమ రతనాల సీమగా మారుతుంది. అందుకోసం విభజన చట్టం తోడ్పాటు తీసుకున్నాం.
పోలవరాన్ని వైకాపా ప్రభుత్వం గోదారిలో కలిపేసింది. రాష్ట్రానికి వరంగా మారాల్సిన పోలవరం శాపంగా మారింది. ఇటీవల ఎన్నికల్లో కూటమికి చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విజయం ప్రజలు కట్టబెట్టారు. వైకాపా 11 సీట్లకే పరిమితమైంది. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో గత అయిదేళ్లు ప్రత్యక్షంగా చూశాం. అమరావతి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. కేంద్ర నిధులతో పోలవరం కట్టి, ఇక్కడి నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటే సాగునీటి రంగానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. పోలవరం సందర్శించాక చాలా బాధేస్తోంది. ప్రజావేదికను కూల్చి జగన్ పాలన ప్రారంభించారు. పవిత్ర జలాలు, మట్టి తీసుకొచ్చి ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతం కాబట్టి ఆ మట్టే మనల్ని కాపాడిరది. పవిత్రమట్టి చూసిన తర్వాత అదే అనిపించింది. కొన్ని అల్లరిమూకలు ఇక్కడ ఏర్పాటు చేసిన నమూనాలను కూడా ధ్వంసం చేశాయి.
అమరావతి రైతులు వాటిని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. పైపులు, రోడ్డు, మట్టిని దొంగతనం చేస్తున్నా వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎక్కడ కట్టిన బిల్డింగులు అలాగే ఉన్నాయి. ఐకానిక్ కట్టడాలన్నీ నిలిచిపోయాయి. ఎలాంటి మార్పు చేయలేదు. పూర్తి కావాల్సిన ఎన్నో పనులు నిలిపివేశారు. ఐఏఎస్, ఐపీఎస్ భవనాలు, అసెంబ్లీ బిల్డింగ్ ఉండాల్సిన చోట తుమ్మచెట్లు మొలిచాయి. రాజధాని పూర్తయి ఉంటే (చిత్రాన్ని చూపించారు) ఈ పాటికి ఇలా ఉండేది. కేంద్రం ఇచ్చిన ప్రోత్సాహంతో రాష్ట్రంలోని ప్రాంతాల్లో 11 కేంద్రీయ విద్యాసంస్థలు ఏర్పాటు చేశాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఆనాడే స్పష్టమైన విధానం ప్రకటించామని అన్నారు. శివరామకృష్ణ కమిటీ చెప్పినట్లుగా సెంట్రల్‌లో అమరావతిని ఏర్పాటు చేశాం. అయినా రాజధానిపైన బురదజల్లే ప్రయత్నం చేశారు.
అమరావతి బ్రాండ్‌ను దెబ్బతీయాలని చూశారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ అని ఆరోపించారు. విషం చిమ్మి సింగపూర్ కన్సార్టియంను తరిమేశారు. ఇక్కడి రైతులు స్వచ్ఛందంగా భూములిస్తే వారిపై ఎన్నో అపవాదులు వేశారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారు. అయిదేళ్ల తర్వాత విూ రాజధాని ఏది అని అడిగితే చెప్పుకోలేని పరిస్థితికి తీసుకొచ్చారు. ఇలాంటి వ్యక్తులకు ఓటేసిన వారు ఆలోచించుకోవాలి. అమరావతి, పోలవరం మాకేం సంబంధం అనుకోవద్దు. తెలుగుజాతి గర్వంగా తలెత్తుకునేలా రాజధాని నిర్మాణం ఉండాలన్నదే తమ సంకల్పమని అన్నారు. కర్నూలును ఆధునిక నగరంగా తయారు చేయాలి. 70-80 దేశాల్లో తెలుగు ప్రజలు అమరావతిని నాశనం చేయడంపై నిరసన తెలిపారు. రౌడీయిజం రాజకీయాల్లో లేకుండా చేస్తాం. అలాంటి వారిని ఉక్కుపాదంతో అణచివేస్తాం.
ఋషులు తపస్సులు చేసిన ప్రాంతం రుషికొండను నాశనం చేశారు. ఖజానా మొత్తం ఖాళీ అయ్యింది. లెక్కలు చూపించి.. చూపించకుండా ఎన్నో చోట్ల అప్పులు తీసుకొచ్చారు. హిరోషిమా, నాగసాకిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజావేదికను జగన్ విధ్వంసానికి గుర్తుగా అలాగే ఉంచుతాం. గత సీఎంలు చేతనైతే అభివృద్ధి చేశారు. లేకుంటే ఊరుకున్నారు. జగన్ అలా చేయలేదని చంద్రబాబు తీవ్ర స్థాయిలో గత వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు.