21-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 21: భారాసకు భారీ షాక్ తగిలింది. తెలంగాణ మాజీ స్పీకర్, భారాస బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పోచారంతో పాటు ఆయన కుమారుడూ కాంగ్రెస్‌లో చేరారు. ఎన్నికల సందడి సద్దు మణగడంతో కాంగ్రెస్ ఆకర్శ్‌కు పదను పెట్టింది. చాపకింది నీరులా వ్వయహారం చక్కబడింది. అనూహ్యంగా పోచారం శ్రీనివాసరెడ్డి స్వయంగా సిఎం రేవంత్‌ను తన ఇంటికి ఆహ్వానించారు. దీంతో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపి బలరామ్ నాయక్ తదితరులు నేగా పోచారం ఇంటికి వెళ్లారు. కాసేపట్లోనే ఈ ప్రకటన వచ్చింది. అనంతరం రేవంత్, పోచారం విూడియాతో మాట్లాడారు. రైతుల సంక్షేమానికి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నో సేవలందించారని రేవంత్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని.. ఈ విషయంలో పోచారం సూచనలు స్వీకరిస్తామని చెప్పారు.
వ్యవసాయం దండగ కాదని.. పండగ చేసే బాధ్యత తమదని చెప్పారు. రైతు సంక్షేమ రాజ్యం కోసం సహకరించే అందరి మద్దతు తీసుకుని ముందుకెళ్తామన్నారు. పోచారం లాంటి వారి సలహాలు తీసుకుని ముందుకు వెళతామని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించామన్నారు. అండగా పెద్దలు నిలబడాలని కోరినట్టు వెల్లడించారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్‌లో చేరారని తెలిపారు. ’రైతుల సంక్షేమంపై వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళతాం. రైతు రుణమాఫీ విధివిధానాలపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నాం. భవిష్యత్‌లో పోచారం శ్రీనివాస్ రెడ్డికి సముచిత గౌరవం ఇస్తాం. నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆయన సహకారం తీసుకుంటాం. ఇది రైతు రాజ్యం.. రైతు సంక్షేమ రాజ్యం.. రైతు సంక్షేమం కోసం అవసరమైన అందరినీ కలుపుకుని పోతాం.’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉదయం పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.
ఇప్పటికే ప్రాథమిక చర్చలు పూర్తి అయిన వేళ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. సుమారు రెండు గంటల చర్చల అనంతరం పార్టీలో చేరుతున్నట్టు మాజీ స్పీకర్ పోచారం విూడియాకు తెలిపారు. రైతు బిడ్డను కాబట్టి.. వ్యవసాయంతో ఉన్నటువంటి అనుబంధం తెలుసు కాబట్టి వారు తీసుకుంటున్న నిర్ణయాలకు అండగా ఉండాలని, రైతులు బాగుపడాలని, వారి కష్టాలు తీరాలని ఉద్దేశంతో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను. కొన్ని సమస్యలు వస్తాయి.. వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నారు. వారి కేబినెట్‌ను అభినందిస్తున్నాను. నా జీవితంలో రాజకీయంగా ఆశించేది ఏం లేదు. రైతులతో పాటు వ్యవసాయం బాగుండాలి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రగతిలో చేదోడు వాదోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను అని పోచారం తెలిపారు. టీఆర్‌ఎస్ కంటే ముందు టీడీపీలో ఉన్నాను. ఆనాడు ఉన్న పరిస్థితులను బట్టి టీఆర్‌ఎస్‌లో చేరాను. కాంగ్రెస్ పార్టీతోనే నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది.
మళ్లీ చివరగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను. రేవంత్ కార్యక్రమాలు నచ్చి వారి నాయకత్వాన్ని బలపరచాలని కాంగ్రెస పార్టీలో చేరాను. రైతుల సంక్షేమాన్ని మాత్రమే నేను కోరుకుంటున్నాను. రేవంత్‌ను భగవంతుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నానని పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నానని.. సీఎం రేవంత్‌ను మనస్ఫూర్తిగా ఇంటికి ఆహ్వానించానని పోచారం తెలిపారు. రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల ప్రగతికి తీసుకున్న నిర్ణయాలు ఆమోదయోగ్యంగా ఉన్నాయన్నారు. తాను రైతుబిడ్డనని.. అందుకే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు అండగా ఉండాలనే రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరినట్లు వివరించారు. సమస్యలను అధిగమిస్తూ సీఎం రేవంత్ ధైర్యంగా ముందుకెళ్తున్నారు. నా జీవితంలో ఆశించేది రైతు సంక్షేమం తప్ప ఇంకేవిూ లేదు. గతంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశాను.
అందరి సహకారంతో రాష్ట్ర భవిష్యత్ కోసం పనిచేస్తాం. నా రాజకీయ జీవితం ప్రారంభమైందే కాంగ్రెస్‌తో. ఆ తర్వాత తెదేపా, భారాసలో పనిచేశాను. రేవంత్ చేపడుతున్న కార్యక్రమాలకు అండగా ఉండాలనే కాంగ్రెస్‌లో చేరాను. తను ఇప్పుడు పదవులకోసం పాకులాడే అవసరం లేదన్నారు. 20 ఏళ్లు రాష్టాన్రికి నాయకత్వం వహించే ఓపిక ఆయనకు ఉంది. మాకు వయసైపోయింది.. పనిచేసే నాయకుడిని ప్రోత్సహించాలని పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో ఇటివల పార్లమెంట్ ఎన్నికల్లో విఫలమైన బీఆర్‌ఎస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా తయారైంది. పార్టీలోని కీలక నేతలు క్రమంగా పార్టీని వీడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మాజీ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లగా, శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గం నుంచి 2009 నుంచి 2023 వరకు వరసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎంపిక కావడం విశేషం.
ఆ క్రమంలోనే పోచారం తెలంగాణ ప్రభుత్వంలో 2014`2019 వరకు వ్యవసాయ మంత్రిగా, 2019 జనవరి 17 నుంచి 2023 డిసెంబర్ 6 వరకు తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కీలక నేతలైన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ రంజిత్ రెడ్డి, కేకే, కడియ శ్రీహరి, కడియం కావ్యాలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాదు మరికొన్ని రోజుల్లో ఇంకొంత మంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేపథ్యంలోనే పోచారంతో సీఎం భేటీపై ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి స్పందించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో 20 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చేరనున్నట్లు తెలిపారు. దీంతో బీఆర్‌ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్ విధానాలే బీఆర్‌ఎస్ పార్టీని ముంచాయని వ్యాఖ్యానించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డే కాదు, చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని దానం అన్నారు. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్‌ఎస్ మొత్తం ఖాళీ అవుతుందన్నారు.
ఇక చేరనున్న వారిలో కాలే యాదయ్య, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ యాదవ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, కుత్బుల్లా పూర్ ఎమ్మెల్యే వివేకానంద్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ ఉన్నారని చెప్పారు. దీంతోపాటు మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. చేరికలపై రెండు మూడు రోజులుగా సీఎం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, సునీల్ కనుగోలు చర్చించారని అన్నారు. మరోవైపు హరీష్ రావుతో కలిసి పలువురు బీజేపీకి వెళ్లేందుకు ట్రై చేస్తున్నట్లు తెలిపారు. ఈ విధంగా బీఆర్‌ఎస్ పార్టీ నుంచి అందరు నేతలు వెళ్లి పోతే ఇక చివరికి మిగిలేది కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్, కుమార్తె కవిత, మేనల్లుడు హరీశ్ రావు మాత్రమే మిగిలే విధంగా అనిపిస్తుంది.