21-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 21: పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరిన క్రమంలో మాజీ ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ నాయకుడు బాల్క సుమన్, ఇతర భారాస నేతలు పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి చేరుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అక్కడ ఉన్న సమయంలోనే నిరసనకు దిగారు. ఈక్రమంలో భారాస, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో బాల్క సుమన్, భారాస నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ ఇంటి దగ్గర బాల్క సుమన్ నేతృత్వంలో ఆందోళన నిర్వహించారు. ఆ క్రమంలో పోచారం ఇంట్లోకి బీఆర్‌ఎస్ నేతలు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బాల్క సుమన్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ క్రమంలో పోలీసులు బీఆర్‌ఎస్ నేతలను అడ్డుకోగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది.
ఎంత సేపటికీ వినకపోవడంతో బాల్క సుమన్ సహా పలువురు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని సమాచారం తెలుసుకుని ఆయన ఇంటి వద్దకు చేరుకుని బాల్క సుమన్ నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. అప్పటికే పోచారం సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకుని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఈసారి ప్రకటించనున్న మంత్రి వర్గంలో పోచారానికి మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.