21-06-2024 RJ
తెలంగాణ
న్యూఢిల్లీ/హైదరాబాద్, జూన్ 21: యోగా అంటే శరీరాన్ని, మనసును కలిపే పక్రియ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన యోగా మహోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రాణులు ప్రకృతితో మమేకమవ్వడమే యోగా అంతరార్థమని తెలిపారు. ఇవాళ ప్రపంచమంతా యోగా వైపు చూస్తోందని చెప్పారు. యోగా అలవాటు చేసుకుంటే విజయాలన్నీ చేకూరతాయన్నారు. ప్రధానిగా మోదీ నిర్ణయాన్ని ప్రపంచమంతా ఆచరిస్తోందని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. మోదీ వల్ల యోగాకు అన్ని దేశాల్లో ప్రాముఖ్యత లభించిందని తెలిపారు. కులమతాలకు అతీతంగా అందరూ నేర్చుకోవాల్సిన విద్య యోగా అని వివరించారు. హైదరాబాద్‌లోని కన్హ శాంతివనంలో నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమలో తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. వరంగల్‌లోని సీకేఎం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో చినజీయర్ స్వామి పాల్గొన్నారు.
కరీంనగర్‌లోని జ్యోతినగర్ మున్సిపల్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొని యోగాసనాలు వేశారు. ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేయడంతో పాటు మరో పది మందితో యోగా చేసేలా కృషి చేయాలని బండి సంజయ్ పేర్కొన్నారు. యోగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు మాత్రమే కాకుండా ప్రతి నిత్యం యోగా చేయడం అలవర్చుకోవాలని సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించు కుని దేశవ్యాప్తంగా యమోగా వేడుకలు ఘనంగా జరిగాయి. పలు రాష్ట్రాల్లో యోగాలో మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. బిజెపి అధ్యక్షుడు నడ్డా, కేంద్రమంత్రులు యోగా డేలో యోగాసస నాలు వేశారు. ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో చిన్నారులతో పాటు పలువురు హాజరయ్యారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 నుండి ఏటా జూన్ 21న జరుపుకుంటున్నారు. పలు రాష్టాల్ర ముఖ్యమంత్రులు సైతం యోగా వేడుకల్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ యోగాసనాలు వేశారు.
స్వచ్చంద, ఆధ్మాత్మిక సంస్థలు ఆధ్వర్యంలో పలుచోట్ల యోగా శిక్షణ శిబిరాలు ఏర్పాటుచేశారు. యోగా విశిష్టతలు, దాని ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఆస్తులు, అంతస్తులు ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదని సంపూర్ణ ఆరోగ్యమే ఓ వరమని మంత్రులు పలువురు చెప్పారు. నిత్యం యోగాసనాలు వేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని... ఒత్తిళ్లను దూరం చేసుకోవచ్చని తెలిపారు. మరోవైపు పలుచోట్ల మంత్రులు, ప్రజలు యోగా వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రులందరూ ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమానికి పట్టణ వాసులు, విద్యార్ధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విద్యార్థినీ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని ఆసనాలు వేశారు. యోగా ప్రాధాన్యతను వివరిస్తూ... ఆసనాల వల్ల కలిగే ప్రయోజనాలను శిక్షకులు వివరించారు.