21-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 21: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. శాసనసభలో తొలుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, నారా లోకేశ్, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, డోలా బాల వీరాంజనేయస్వామి, బీసీ జనార్దన్‌రెడ్డి, సవిత, గుమ్మడి సంధ్యారాణి, కందుల దుర్గేశ్, ఎన్‌ఎండీ ఫరూక్ ప్రమాణం చేశారు. పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి, ఆనం రామనారాయణరెడ్డి, రామ్‌ప్రసాద్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, వాసంసెట్టి సుభాష్ తదితరులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మిగతా సభ్యులు ప్రమాణం చేశారు. వైకాపా అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.
ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం చేసిన అనంతరం జగన్ సభలో ఉండకుండా ఛాంబర్‌కు వెళ్లిపోయారు. అంతకుముందు అసెంబ్లీ వెనుక గేటు నుంచి ప్రాంగణంలోకి జగన్ వచ్చారు. గతంలో ఆయన సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి మందడం విూదుగా సభకు వచ్చేవారు. అమరావతి రైతులు నిరసన తెలుపుతారని భావించి వేరే మార్గంలో సభకు వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చినా ఆయన లోపలికి వెళ్లలేదు. సభ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత వెళ్లారు. తన ప్రమాణస్వీకార సమయం వచ్చినపుడే సభలో జగన్ అడుగుపెట్టారు. చంద్రబాబు ప్రమాణం చేస్తుండగా సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బాబు సభలోకి అడుగు పెట్టగానే చప్పట్లతో స్వాగతం పలికారు.