21-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 21: ఏపీ శాసనసభ స్పీకర్ పదవి కోసం తెదేపా సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున కూటమి నేతలు నామినేషన్ పత్రాలను శాసనసభ కార్యదర్శికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ పాల్గొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు. అయితే ఒకేఒక నామినేషన్ దాఖలు కావడంతో పాటు, టిడిపి కూటమి పూర్తి మెజార్టీతో ఉండడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
మరోవైపు శాసనసభ శనివారానికి వాయిదా పడింది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. నేడు 172 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. అందుబాటులో లేకపోవడం, ఇతర కారణాలతో ముగ్గురు ప్రమాణస్వీకారం చేయలేదు. వారిలో పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావు, జీవీ ఆంజనేయులు ఉన్నారు. ఆ ముగ్గురితో శనివారం ప్రమాణం చేయించనున్నారు.