21-06-2024 RJ
సినీ స్క్రీన్
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో ’కూలీ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి ఒక చిన్న ప్రచార వీడియోని కూడా ఆమధ్య ఒకటి విడుదల చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం రజినీకాంత్ ఈ సినిమాలో ఎటువంటి పాత్ర చెయ్యబోతున్నారు అనే విషయంపై లీక్ అయింది. ఆ లీకైన సమాచారం ప్రకారం రజినీకాంత్ ఈ సినిమాలో ఒక ఎన్ కౌంటర్ స్పెషలిస్టు పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఆసక్తికరం ఏంటంటే రజినీకాంత్ ఇంకో సినిమా ’వెట్టయ్యాన్’ లో కూడా పోలీసు పాత్రలోనే రజినీకాంత్ కనపడనున్నారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే, రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ ఫహాద్ ఫాజిల్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనపడనున్నారని తెలుస్తోంది. ఈ పాత్ర అనుకున్న వెంటనే ఫహాద్ అయితే బాగుంటారు అని అతనికి వెంటనే కథ చెప్పడం జరిగిందని, ఫహాద్ చెయ్యడానికి అంగీకరించారని తెలిసింది.
ఈ సినిమాలో రజినీకాంత్ ఎన్ కౌంటర్ స్పెషలిస్టు అయితే, అతనికి ఒక ఆధునిక సాంకేతిక ప్రత్యేక అధికారిగా రజినీకాంత్ వెన్నంటే వుండే పాత్రలో ఫహాద్ కనిపించనున్నారని తెలుస్తోంది. కేవలం రజినీకాంత్ ఇందులో కథానాయకుడిగా చేస్తున్నారని, ఫహాద్ ఈ పాత్ర వొప్పుకున్నట్టుగా తెలిసింది. ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం అవుతుందని కూడా తెలుస్తోంది. ఫహాద్ ప్రస్తుతం ’పుష్ప 2’ సినిమా చిత్రీకరణలో వున్నారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ దర్శకుడు. ఈ సినిమాలో ఫహాద్ పోలీసు ఆఫీసరుగా కనిపించనున్నారు.