22-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 22: హైదరాబాద్ ను మెడికల్ టూరిజం హబ్‌గా ఏర్పాటు చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక్కడ అత్యంత అధునాతన ఆస్పత్రులు ఉన్నాయని, వాటిని కనెక్ట్ చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం మెడికల్ టూరిజం ప్రతిపాదన ఉందన్నారు. సీఎం హోదాలో తాను నిత్యం 18 గంటలు పనిచేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ 24వ వార్షికోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆలోచనను కుటుంబ సభ్యులు కార్యరూపంలో పెట్టారని చెప్పారు. క్యాన్సర్ ను అరికట్టాలనేది గొప్ప ఆలోచన అని అన్నారు. భవిష్యత్ లోనూ బసవతారకంకు తోడుంటామని చెప్పారు. ఆస్పత్రి విస్తరణకు సహకరిస్తామని చెప్పారు. నిత్యం ఎంతో మందికి ఆస్పత్రి సేవలందిస్తుందని తెలిపారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు పక్కన భూమి తీసుకుని మెడికల్ హబ్‌గా పెద్ద ఆస్పత్రులు కట్టిస్తామని తెలిపారు.
హైదరాబాద్‌కు వస్తే జబ్బు నయమౌతుందనేలా చేస్తామని అన్నారు. అభివృద్ధి సంక్షేమంలో తెలుగు రాష్ట్రాలు పోటి పడుతాయని తెలిపారు. 24వ వార్షికోత్సవానికి బాలకృష్ణ ఆహ్వానించారని 30వ వార్షికోత్సవానికి కూడా తానే వస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బసవతారకం ఆసుపత్రి లక్షలాది మందికి సేవలందిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నిస్వార్థంగా పేదలకు సేవలందించేందుకు ఆసుపత్రిని నిర్మించారని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం నాకు వచ్చింది. ఆయన 18 గంటలు పనిచేసి.. నేను 12 గంటలు పని చేస్తే సరిపోదు. తెలంగాణ రాష్ట్ర నేతలు, అధికారులు కూడా 18 గంటలు పని చేయాల్సిందే. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు పోటీ పడాలి.. ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి. హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని చూస్తున్నాం అని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి తెలిపారు. అన్ని రకాల వైద్యసేవలు అందించేందుకు హెల్త్ టూరిజం హబ్ ఉంటుందన్నారు. అందులో బసవతారకం ఆసుపత్రికి తప్పకుండా స్థానం ఉంటుంది. వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలన్నారు.
ప్రపంచంలోని ఎవరైనా హైదరాబాద్‌కు వస్తే అన్ని రకాల వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ ఆలోచనలో ఏర్పాటైన ఈ ఆసుపత్రి 24 ఏళ్లుగా కోట్లాది మందికి సేవ చేయడం ఆనందదాయకమని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించేందుకు చంద్రబాబు నాయుడు ఆసుపత్రిని పూర్తి చేసి పేదలకు సేవలు అందించడం అభినందనీయమన్నారు. నిరుపేదలకు వైద్యసేవలు అందించాలన్న ఎన్టీఆర్ ఆశయాలను అమలు చేయడం చూసి స్వర్గం నుంచి మనల్ని ఆశీర్వదిస్తానన్నారు. నిరుపేదలకు క్యాన్సర్ వ్యాధిని నయం చేసేందుకు వైద్యరంగంలో విశేష కృషి చేసిన ఎన్టీఆర్ బసవతారం ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని హావిూ ఇచ్చారు. ఆసుపత్రికి సంబంధించి ఎలాంటి సహకారం అందించాలన్నా మా ప్రభుత్వం అండగా ఉంటుందని ఆసుపత్రి ఛైర్మన్ బాలకృష్ణ హావిూ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమంలో చంద్రబాబు నాయుడుతో పోటీపడే అవకాశం వచ్చిందన్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో తెలుగు రాష్టాల్రు ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలన్నారు. ఎన్టీఆర్‌కు రాజకీయాలు, సంక్షేమం వారసత్వంగా వచ్చాయి. రెండు కిలోల బియ్యంతో బసవతారకం ఆస్పత్రిని నిర్మించి పేదలకు అండగా నిలిచారని ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ మొదటి తరం అయితే, రెండో తరం చంద్రబాబు, బాలకృష్ణ అని, మూడో తరం లోకేష్, భరత్ అని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ మూడో తరం కూడా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. నందమూరి తారక రామారావు భార్య, బాలకృష్ణ తల్లి బసవతారకం క్యాన్సర్‌తో మరణించారు. ఆ సమయంలో క్యాన్సర్ చికిత్స అందుబాటులో లేదు. దీంతో కేన్సర్ బారిన పడిన పేదలు వైద్యం చేయించుకోలేకపోతున్నారు. అందుకే పేదలకు వైద్య సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ఈ బసవతారకం ఆసుపత్రిని ప్రారంభించారు. డొనేషన్‌తో నడిచే ఈ ఆసుపత్రిలో పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందుతుంది. అందుకే అన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి క్యాన్సర్ రోగులు వచ్చి చికిత్స పొందుతున్నారు. క్యాన్సర్ మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తోందని బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆసుపత్రి సేవల విస్తరణ కోసం సీఎం రేవంత్‌రెడ్డి సహకారం కోరగానే అంగీకరించారని చెప్పారు. దాతల సహకారంతో ఆసుపత్రి ఈ స్థాయికి చేరుకుందని తెలిపారు. సేవలను మరింత విస్తరించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, డా.నోరి దత్తాత్రేయుడు పాల్గొన్నారు.