22-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 22: రెండ్రోజులపాటు జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు శనివారంతో ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన 16వ శాసనసభ సమావేశాలు ముగిశాయి. తొలి రోజు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సహా ఇతర ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. రెండో రోజు స్పీకర్‌గా టీడీపీ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఏపీ సభాద్యక్షులు గా ఎన్నికైన అయ్యన్నకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం ఏపీ అసెంబ్లీని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. కాగా రెండో రోజు సమావేశాలకు వైసీపీ సభ్యులు దూరంగా ఉన్నారు.
ఇకపోతే శనివారం రోజున కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఏపీ అసెంబ్లీకి విచ్చేశారు. అసెంబ్లీ లాబీలో ఏపీ మంత్రి నారా లోకేష్‌ను ఆయన కలిశారు. టీడీపీ యువనేతలు ఇరువురు ఆత్మీయ ఆలింగనం చేసుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం కాసేపు మాట్లాడుకున్నారు. రాష్ట్రంలోని పెండిరగ్ విమానాశ్రయాలపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడ్ని లోకేష్ ఆరా తీశారు. పెండిరగ్ విమానాశ్రయాలను రెండేళ్ల లోపు పూర్తి చేస్తామని రామ్మోహన్ నాయుడు బదులిచ్చారు. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రామ్మోహన్ నాయుడ్ని లోకేష్ కోరారు.