22-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 22: ’కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధిని చావు దెబ్బతీసిందని వక్తలు అన్నారు. సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలు జుడీషియల్ కమిషన్‌కు ఉన్నాయి. మొత్తం ప్రాజెక్టుపై సమగ్ర న్యాయవిచారణ జరిపించాలి. తప్పుల తడక డిజైన్లకు ఎలా అనుమతిచ్చారు. ఇరిగేషన్ అంటేనే మాఫియాగా మారింది’ అని పలువురు వక్తలు ఆరోపించారు. ’జుడీషియల్ కమిషన్‌లను బెదిరించే కేసీఆర్ భూస్వామ్య రాచరిక విధానాలను ఖండించండి, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపించండి’ అంటూ తెలంగాణ జలసాధన సమితి, తెలంగాణ రైతుసంక్షేమ సమితిల ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ లో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.సమితి అధ్యక్షుడు నైనాల గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం వేసిన జుడీషియల్ కమిషన్ విచారణ ప్రభుత్వం రిఫరెన్స్ చేసిన విషయాల వరకు మాత్రమే పరిమితం అవుతుందని అన్నారు.
జుడీషియల్ కమిషన్ అంటే సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలు ఉంటాయని అన్నారు. న్యాయనిపుణుల సలహా తీసుకుని ఒక క్రిమినల్ ఫిర్యాదును తయారు చేసి సీఎంకు, డీజీపీకి, ఏసీబీకి పంపిద్దామని అన్నారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి మాట్లాడుతూ గడిచిన పదేళ్లలో ఎన్డీఏ, టీఆర్‌ఎ?స, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు అనేక విషయాల్లో ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నాయని ఆరోపించారు. సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ ప్రపంచంలో అద్భుతమైన ప్రాజెక్టు అని చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధిని చావు దెబ్బతీసిందని ఆరోపించారు. అసలు ప్రాజెక్టుకు ఎవరు అనుమతి ఇచ్చారు అని నీటిపారుదల విశ్లేషకులు సాంబశివరావు ప్రశ్నించారు.
తప్పుల తడక డిజైన్లు, తడక లాంటి నిర్మాణాలు, వర్షం పడితే కొట్టుకు పోతాయని సీనియర్ పాత్రికేయుడు పాశం యాదగిరి అన్నారు. ఇరిగేషన్ అంటే మాఫియాగా మారిందని, ఇక్కడి డబ్బుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోమాలోకి పోయిందని నైనాల గోవర్ధన్ అన్నారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు అన్వేష్‌రెడ్డి, దొంతి నర్సింహరెడ్డి, తెలంగాణ ప్రజా చైతన్య వేదిక చైర్మన్ ప్రొఫెసర్ కె.వెంకట్‌నారాయణ, బీఎల్‌ఎఫ్ చైర్మన్ నల్ల సూర్యప్రకాష్, పృథ్వీరాజ్‌యాదవ్ విఠల్, సోగరా బేగం, నరసింహ, సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు.