22-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
గుంటూరు, జూన్ 22: గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద రోడ్డుపైనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజాదర్బార్ నిర్వహించారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి గా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టడం అటు అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆయన పాల్గొనడంతో సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు జనసేన కార్యాలయానికి బారులు తీరుతున్నారు. జనసేన కార్యాలయానికి అప్పుడే వచ్చిన డిప్యూటీ సీఎం.. కారు నుంచి దిగి రోడ్డుపైనే కుర్చీలు వేయించి వారితో మాట్లాడారు. సమస్యలు విన్న పవన్ కల్యాణ్.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హావిూ ఇచ్చారు. అర్జీదారుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా బాధితులు తమ సమస్యలు చెప్పుకొని వాటిని తీర్చాలని కోరగా.. అధికారులతో ఫోన్‌లో మాట్లాడి కొన్ని సమస్యలు తక్షణమే పరిష్కరించారు. మరికొన్ని సమస్యల పరిష్కారానికి కాల పరిమితి నిర్ణయించి ఆలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డుపైనే ప్రజాదర్బార్ నిర్వహించి తమ సమస్యలు పరిష్కరించడంతో ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఓ బాలిక మిస్సింగ్ కేసులో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు.
విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అని ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముందు కన్నీటితో మొరపెట్టుకుంది. మాచవరం పోలీస్ స్టేషన్‌లో దీనిపై ఫిర్యాదు చేశామని, తమ కూతురు జాడ తెలిసినా పోలీసులు స్పందించడం లేదని వేదన చెందారు. జాడ తెలిశాక కూడా తమ బిడ్డను తమకు అప్పగించడం లేదని ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీని పరిశీలించిన వెంటనే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాచవరం సీఐకి ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు. దీనిపై చర్యలకు ఆదేశించారు. పార్టీ నాయకులను, బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్‌కు పంపించారు.