22-06-2024 RJ
సినీ స్క్రీన్
కల్కి 2898 ఏడీ’ చిత్రంలో పలు అతిథి పాత్రలున్నాయని, ఇంతకుముందు వైజయంతీ నెట్‌వర్క్ చిత్రాల్లో సందడి చేసిన కొందరు ఆ క్యారెక్టర్లు ప్లే చేస్తున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. దీనిపై చిత్ర బృందం ఇప్పటివరకూ స్పందించలేదు. కానీ, ’రిలీజ్ ట్రైలర్’ లో ఓ హీరోయిన్‌ను చూపించి అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. ఆమే మాళవిక నాయర్. గతంలో వైజయంతీ నెట్‌వర్క్ బ్యానర్‌లలో తెరకెక్కిన ’ఎవడే సుబ్రహ్మణ్యం’, ’మహానటి’లోను ఆమె కీలక పాత్రలు పోషించి, మెప్పించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూడు చిత్రాల్లో ఆమె నటించడం విశేషం. అదే నెట్‌వర్క్‌లో వచ్చిన ’అన్నీ మంచి శకునములే’లోనూ ఆమె సందడి చేశారు. ట్రైలర్‌లోని తన లుక్‌ని స్క్రీన్‌షాట్ తీసి, అభిమానులు సోషల్ విూడియాలో పోస్ట్ చేయగా మాళవిక ఆనందం వ్యక్తంచేశారు. వాటిని తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేస్తూ థ్యాంక్స్ చెప్పారు.
కొన్ని రోజుల క్రితం విడుదలైన తొలి ట్రైలర్ ద్వారా ఈ సినిమాలో అలనాటి హీరోయిన్ శోభన ఉన్నారని తెలిసింది. ఆ తర్వాత చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఆమె లుక్‌ని షేర్ చేసింది. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారని రూమర్స్ వచ్చాయి. నాగ్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్నో సర్‌ప్రైజ్ లుంటాయని తెలిపారు. మరి, ఆయన ఈ రోల్స్ గురించే చెప్పారా, వేరే దాని గురించా? అంటే వేచి చూడాల్సిందే. ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. కాశీ, కాంప్లెక్స్, శంబల అనే మూడు ప్రపంచాల చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 27న విడుదల కానుంది.