24-06-2024 RJ
తెలంగాణ
నిజామాబాద్, జూన్ 24: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. అనూహ్యంగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరగా, తరవాత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ రెండు కూడా ఊహించని ఘటనలు కావడంతో ఉమ్మడి నిజామాబాద్‌లో అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బాన్స్ వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరికతో నేతల క్యూ మొదలైంది. జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
అయితే తనకు తెలియకుండానే సంజయ్ కుమార్‌ను పార్టీలో ఎలా చేర్చుకుంటారని సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే జీవన్ రెడ్డి ఇంట్లో ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. పార్టీలో సంజయ్ కుమార్ చేరిక అంశం గురించి చర్చించారు. సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని జీవన్ రెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సీనియర్ అయిన తనకు తెలియకుండా ఎలా పార్టీలో చేర్చుకుంటారని జీవన్ రెడ్డి అంటున్నారు. తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి సాయంత్రం హైదరాబాద్ వెళ్లి కాంగ్రెస పెద్దలను కలవాలని నిర్ణయించారు. తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. గత ఎన్నికల్లో జగిత్యాల నుంచి ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపిగా పోటీ చేసి ఓడిపోయారు.
జగిత్యాలలో మరో కాంగ్రెస్ నేతకు అవకాశం లేకుండా డాక్టర్ సంజయ్ వ్యూహిత్మకంగా పార్టీలో చేరారని అంటున్నారు. జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచివుంటే మంత్రివర్గంలో తప్పకుండా చోటు లభించేది. జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డికి మంచి పేరు ఉంది. వైఎస్ హయాంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా జీవన్ రెడ్డి పనిచేశారు. ఎమ్మెల్యేగా ఓడినా, కాంగ్రెస్ నిజామాబాద్ ఎంపిగా నిలబెట్టింది. అయినా గెలవలేక పోయారు. దీంతో జగిత్యాలలో కొంత ఆయనకు మైనస్ అయిందని భావిస్తున్నారు. అయితే పోచారం మాత్రం తన తనయుడి రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారారని చర్చించుకుంటున్నారు.