24-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 24: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలోని మొలచింతలపల్లికి చెందిన గిరిజన మహిళ ఈశ్వరమ్మ(25)పై ఆమె బంధువులు పాశవికంగా దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈశ్వరమ్మకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పను ఆదేశించారు. ఈ మేరకు బీరప్పతో రాజనర్సింహ ఫోన్‌లో మాట్లాడారు. ఈశ్వరమ్మ ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని మంత్రి ఆదేశించారు. ఆమె వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుదని మంత్రి స్పష్టం చేశారు.
ఆమె కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని రాజనర్సింహ భరోసా ఇచ్చారు. కాగా, ఈశ్వరమ్మ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈశ్వరమ్మ కుటుంబానికి 25 ఏండ్ల కింద ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయ భూమి, ఇంటి పత్రాలను వెంటనే వారి పేర చేయాలని అధికారులను కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.