25-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్టణం, జూన్ 25: నీట్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విశాఖలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. జీవీఎంసీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ.. నీట్ పరీక్ష సరిగా నిర్వహించలేని ఎన్‌టిఏ ను రద్దు చేయాలని నీట్ పరీక్ష పేపర్ లికేజ్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్య శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. నీట్, యూజీ, పీజీ నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని, బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నం లో ర్యాలీ నిర్వహించారు.
ముందుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అనంతరం అక్కడ నుంచి ఆసీలమెట్ట జంక్షన్, ఆర్టిసి కాంప్లెక్స్, గురజాడ జంక్షన్ విూదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ కార్యదర్శి పి.అజరు, అధ్యక్షుడు జి.రాము, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు యు.ఎస్.ఎన్ రాజు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్, నెట్ పరీక్ష పేపర్ల లీకేజీలు దుర్మార్గమన్నారు. దీనివల్ల వేలాదిమంది విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. బాధ్యత విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. ఎన్‌టిఎను రద్దు చేయాలన్నారు. పేపర్ లీకేజీ కి బిజెపి, మోడీ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలన్నారు. నీట్, యుజీ, పిజి పరీక్షల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు.