25-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
చిత్తూరు, జూన్ 25: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం కుప్పం చేరుకున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారిగా తన సొంత నియోజకవర్గానికి రావడంతో.. పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికాయి. అనంతరం శాంతిపురం మండలం జెర్రివానిప్లలె, శాంతిదొడ్డి గ్రామాల్లో ఉన్న హంద్రీ, నీవా కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను ఆయన పరిశీలించారు. ఆ తర్వాత తిరిగి ఆయన కుప్పానికి చేరుకున్నారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.
సభానంతరం ఆర్ అండ్ బి అతిథి గృహానికి సీఎం చంద్రబాబు చేరుకుని.. పార్టీ నేతలో సమావేశం కానున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సొంత నియోజకవర్గానికి రావడంతో చంద్రబాబుకు జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలంతా కలిసి ఘనస్వాగతం పలికారు. అలాగే చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కుప్పం పసుపు మయంగా మారింది. మరోవైపు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లును జిల్లా ఉన్నతాధికారులు పూర్తి చేశారు. అందులోభాగంగా కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకున్నారు