25-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 25: నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని తెచ్చినా మృగాళ్ల తీరు మారడం లేదు. తాజాగా, హైదరాబాద్‌లో దారుణం జరిగింది. మత్తుకు బానిసైన యువకులు ఆ మత్తులోనే దారుణాలకు ఒడిగడుతున్నారు. ఓ బాలికకు గంజాయి అలవాటు చేసిన యువకులు ఆమె మత్తులోకి దిగగానే దారుణానికి ఒడిగట్టారు. ఈ అమానుష ఘటన హైదరాబాద్ నేరేడుమెట్‌లో జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి ఒడిగట్టిన దారుణ ఘటన నేరెడుమెట్ పరిధిలో తాజాగా వెలుగుచూసింది. కాచిగూడలో ఉంటున్న ఓ బాలికను ఐదుగురు యువకులు ట్రాప్ చేసి నేరెడుమెట్ తీసుకెళ్లారు.
అక్కడ బాలికకు గంజాయి అలవాటు చేసి ఆమె మత్తులోకి వెళ్లగానే ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. బాలిక ఈ ఘోరాన్ని తల్లికి చెప్పకుండా దాచింది. ఆమెలో వస్తున్న మార్పులు గమనించిన తల్లి గట్టిగా నిలదీయగా.. జరిగిన దారుణాన్ని తల్లికి చెప్పింది. దీంతో బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించింది. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు.. కేసును నేరెడ్‌మెట్‌కు బదిలీ చేశారు. దీనిపై విచారించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.