25-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
చిత్తూరు, జూన్ 25: కుప్పం ప్రజలు ఎప్పుడూ తనపై నమ్మకం ఉంచారని, మరో జన్మంటూ ఉంటే కుప్పంలోనే జన్మిస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరైనా కుప్పంలో రౌడీయిజం చేస్తే.. అదే వారికి చివరిరోజు అవుతుందని హెచ్చరించారు. కేబినెట్లో 8మందికి కొత్తవారికి అవకాశం కల్పించామని కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తన సొంత నియోజకవర్గం కప్పంలో ఇది తొలిపర్యటన. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ది కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు. గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులను పరిశీలించారు. అనంతరం కుప్పం బస్టాండు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పంను అభివృద్దికి నమూనాగా తయారు చేస్తానని హావిూ ఇచ్చారు. ఈ నియోజకవర్గానికి ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామన్నారు.
అంతేకాకుండా ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేస్తామన్నారు. అందులో భాగంగా ఒక్కో గ్రామానికి రూ. 10కోట్లు అభివృద్ది నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికలు ఎంతో చారిత్రాత్మకం అని వివరించారు. రాబోయే ఐదేళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. కేబినెట్లో కొత్తవారికి ఎక్కువగా అవకాశం ఇచ్చామన్నారు. అలాగే 8మంది బీసీలకు కేబినెట్లో చోటు కల్పించామని చెప్పారు. కుప్పంలో హంద్రీనీవా నీటితో చెరువులన్నీ నింపుతామన్నారు. వైసీపీకి కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ రైతులపై లేదని విమర్శించారు. త్వరలోనే కుప్పంకు విమానాశ్రయం తీసుకువస్తామన్నారు. అంతకుముందు శాంతిపురం మండలం చిన్నారి దొడ్డి, జల్లిగాని పల్లి దగ్గర హంద్రీ నీవా కాలువ పనులు చంద్రబాబు పరిశీలించారు. హంద్రీ నీవా కాలువ స్థితిగతులపై ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చించారు. ఇంకా చేపట్టాల్సిన పనులు, పూర్తి కావాల్సిన పనుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
శాంతిపురం మండలం శివపురంలో తన సొంత ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు చంద్రబాబు. 2 ఏళ్ల క్రితం చంద్రబాబు ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. 2.1 ఎకరాల స్థలంలో ఈ ఇంటి నిర్మాణం కొనసాగుతోంది. నిర్మాణ పనులపై కాంట్రాక్టర్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఏపీ సీఎం. ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిననంతరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో పార్టీ నేతలతో సమావేశం అవుతారు సీఎం చంద్రబాబు. అనంతరం ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరి వెళనున్నారు.