25-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, జూన్ 25: మనపై ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఉన్నారు. భారీ మెజార్టీతో, 100శాతం స్ట్రైక్ రేట్‌తో గెలిపించి అసెంబ్లీకి పంపించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను సభలో ప్రతిఫలింపచేద్దాం అని పార్టీ ఎమ్మెల్యేలకు ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. జనసేన శాసనసభ్యులకు సభా వ్యవహారాలు, నియమావళి, సంప్రదాయాలపై మంగళవారం విజయవాడలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రతీ ఒక్క ఎమ్మెల్యే సభా నియమావళిపై అవగాహన పెంచుకోవాలన్నారు. సభా సంప్రదాయాలు గౌరవిస్తూ నడుచుకోవాలని హితబోధ చేశారు. శాఖాపరమైన అంశాలు, ప్రజా సమస్యలు అధ్యయనం చేసిన తర్వాతే చర్చల్లో పాల్గొనాలని సూచించారు. మహిళల రక్షణ విషయంలో ఎక్కడా రాజీపడవద్దని, గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు. పార్టీ నుంచి గెలిచిన వారిలో ఎక్కువ మంది శాసనసభ వ్యవహారాలకు కొత్తవారే.
అందరం సభ నియమావళి, సంప్రదాయాలపై అవగాహన తెచ్చుకోవాలి. నియమావళిని పాటిస్తూ సంప్రదాయాలను గౌరవించాలి. సభలో హుందాగా ఉండాలి. మన నడవడిక, చర్చించే విధానం ప్రజల మన్ననలు పొందాలి. తొలి వంద రోజులు పాలనాపరమైన విషయాలపై అవగాహన, అధ్యయనంపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వశాఖలు, పాలనాపరమైన విధివిధానాలు, పథకాలు, వాటి అమలు తీరు, సంక్షేమ పథకాలు లబ్దిదారులకు సక్రమంగా చేరుతున్నాయా?లేదా? వంటి విషయాలపై అధ్యయనం చేయాలి. ఆ తర్వాత విూరు చేసే చర్చలు ఎంతో బలంగా ఉంటాయి. విషయాన్ని చెప్పేటప్పుడు భావ తీవ్రత ఉండవచ్చు. భాష సరళంగా, మర్యాదపూర్వకంగా ఉండాలి. అధికారులు, ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు, చర్చల్లో పరుష పదజాలం వాడొద్దు. ప్రజలతో గౌరవంగా ఉంటూ వారు తమ బాధలు, సమస్యలు చెబితే జాగ్రత్తగా వినాలని సూచించారు.
మన పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు అభినందన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాం. ఈ కార్యక్రమం అయిన తరవాత నియోజకవర్గ స్థాయిలో అభినందన కార్యక్రమాలు చేపట్టండి. విూ గెలుపు కోసం తోడ్పడిన కూటమి నాయకులు, మన పార్టీ నాయకులను అభినందించండి. పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో నిస్వార్థంగా పని చేసిన జన సైనికులు, వీర మహిళలను, సభలు, కార్యక్రమాల్లో వాలంటీర్లుగా పని చేసిన వారిని గుర్తించండి. వారి కోసం ప్రత్యేకంగా కృతజ్ఞత కార్యక్రమాలు నిర్వహించాలి. వారితో గౌరవభావంతో ఉండాలి. మన పార్టీ శ్రేణులను బలోపేతం చేసే బాధ్యత విూపై ఉంది. ఇలాంటి అవగాహన చర్చలు ప్రతి నెల నిర్వహించుకుందాం. జనసేన పక్షాన చేసిన జనవాణి కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది. విూరు కూడా నియోజకవర్గ స్థాయిలో ప్రతి నెలా జనవాణి చేపట్టండి‘ అని పవన్ కల్యాణ్ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు.
ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాలని, ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రామస్థాయిలో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టాలని, శాంతిభద్రతల పరిరక్షణకు ఎక్కడా రాజీపడొద్దని ఎమ్మెల్యేలకు చెప్పుకొచ్చారు. పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు త్వరలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ తెలిపారు. నియోజకవర్గాల వారీగా పర్యటన ఉంటుందని, అందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.