25-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 25: సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారైంది. జులై 1వ తేదీ నుంచి తన నియోజక వర్గం పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అదేరోజు సాయంత్రం పిఠాపురంలో మంత్రి పవన్ కళ్యాణ్ వారాహి సభ నిర్వహిస్తారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజక వర్గ ప్రజలకు ఈ సందర్భంగా పవన్ కృతజ్ఞతలు తెలపనున్నారు. 3 రోజులపాటు పిఠాపురంతోపాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారని సమాచారం. కాకినాడ జిల్లా అధికారులు, పిఠాపురం నియోజకవర్గ అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సవిూక్షిస్తారు.
పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టులో పర్యటించనున్నారు. జూన్ 29వ తేదీన పవన్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తారు. అక్కడ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని జనసేన పార్టీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. నేటి నుంచి 11 రోజులపాటు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష కొనసాగించనున్నారు.