26-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, జూన్ 26: రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పినా ఆ పార్టీలో పేర్ని నానిలాంటి వ్యక్తులకు ఇంకా బుద్ధి రావడం లేదని మాజీ మంత్రి పేర్ని నానిపై రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మాజీ సీఎం జగన్ అరాచకాలకు విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు తమకు 95 శాతం మ్యాండెట్ ఇచ్చారన్నారు. అయినా పేర్ని నాని లాంటి వాళ్లు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని, ఇప్పటికే మచిలీపట్నం ప్రజలు పేర్ని నానిని చెప్పుతో కొట్టినట్టు తీర్పు ఇచ్చినా పద్ధతి మార్చుకోవడం లేదని దుయ్యబట్టారు. ఆయన ఇలాగే మాట్లాడితే మచిలీపట్నం నుంచి కూడా ప్రజల తరిమికొడతారన్నారు. ఐదేళ్లుగా పేర్ని నాని చేసిన అవినీతిని ప్రజల ముందు పెట్టి.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.