26-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 26: తొందరపడకండి.. పార్టీ మారుతున్న నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలి’ అని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు హితబోధ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌లో చేరడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బాన్సువాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌లు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఈ తరుణంలో కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో వరసు భేటీ అవుతున్నారు. నిన్న పలువురు ఎమ్మెల్యలతో కేసీఆర్ మంతనాలు జరపగా.. ఇవాళ హరీశ్ రావు, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, సుధీర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డిలతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా పార్టీ మారుతున్న నేతల పట్ల జాగ్రత్తగా ఉండాలని, తొందరపడొద్దని ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. కాగా మంగళవారం ఎర్రవల్లిలోని ఫాంహౌజ్‌లో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్ రెడ్డి, దండె విఠల్, మాజీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, నాయకులు క్యామ మల్లేశ్, రావుల శ్రీధర్ రెడ్డిలు హాజరైన విషయం తెలిసిందే.