26-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 26: కష్టాల్లో ఉన్నవారికి అండగా ఉంటానని ప్రజలకు మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో బుధవారం నిర్వహించిన ’ప్రజాదర్బార్’కు మంగళగిరితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే నారా లోకేశ్‌ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించేందుకు బారులు తీరారు. ఎవరూ అధైర్యపడవద్దని, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హావిూ ఇచ్చారు. ప్రతి ఒక్కరి వద్ద నుంచి వినతిపత్రాలు స్వీకరించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందిని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ సభ్యుల గౌరవ వేతనాలు పెంచాలని మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న కార్మికులు నారా లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం తమకు నెలకు రూ.3 వేల గౌరవ వేతనం ఇస్తున్నారని, దీనిని రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచాలని కోరారు. పాఠశాలల్లో అదనంగా రాగిజావ, కోడిగుడ్లు ఉడకబెట్టేందుకు ఎలాంటి అదనపు వేతనం ఇవ్వడం లేదని తెలిపారు. అందుకయ్యే గ్యాస్ కూడా తమ జీతం డబ్బుల నుంచే ఖర్చుపెట్టుకుని విద్యార్థులకు అందిస్తున్నామని వాపోయారు. జీతాలు సక్రమంగా అందడం లేదని, పని ఒత్తిడి కూడా అధికంగా ఉందని లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తామని తెలిపారు. మధ్యాహ్న భోజనంలో ప్రస్తుతం విద్యార్థులకు అందించే మెనూను అడిగి తెలుసుకున్నారు. మెనూ ఏవిధంగా ఉంటే విద్యార్థులు ఇష్టపడతారో వివరాలు ఇవ్వాలని తనను కలిసిన కార్మికులను కోరారు.
దివ్యాంగులమైన తమకు పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరి మండలం చినకాకానికి చెందిన మంచాల సీతారామయ్య, ఓబులమ్మ దంపతులు లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. స్వర్ణకార చేతివృత్తిపై జీవనం సాగించే తాను అనారోగ్యానికి గురై ఇంటికే పరిమితం అయ్యానని, పింఛన్ మంజూరు చేయించి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన బుట్టా పానకాలు కోరారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుతున్న తన కుమార్తెకు విదేశీ విద్య పథకం ద్వారా ఆర్థికసాయం అందించాలని ఉండవల్లికి చెందిన ఆలపాటి సురేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుడైన తనకు నాలుగు చక్రాల ద్విచక్రవాహనం ఇప్పించి ఆదుకోవాలని తాడేపల్లి మండలం సీతానగరానికి చెందిన ఎస్.రమేష్ విన్నవించారు. మంగళగిరి పట్టణంలో ఆశా కార్యకర్తలుగా పనిచేస్తున్న తమకు పనికి తగిన జీతం ఇవ్వాలని, పని ఒత్తిడి తగ్గించాలని, సెలవులు మంజూరు చేయించాలని కోరారు. ఆయా సమస్యలను పరిష్కరిస్తానని లోకేశ్ వారికి హావిూ ఇచ్చారు.