27-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 27: నిర్దుష్ట ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని, నాలుగు అంశాలను అజెండాగా పెట్టుకున్నామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గంజాయి నిర్మూలన, మహిళలకు రక్షణ, పోలీసుల సంక్షేమం, పోలీసు శాఖలో నియామకాల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ’రెడ్ బుక్’ కక్ష సాధింపు చర్యలకు కాదన్నారు. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులపై చట్టపరంగా చర్యలుంటాయని చెప్పారు. తమకు కక్ష సాధింపు ఉంటే.. ఇంతకాలం ఆగుతామా అని వ్యాఖ్యానించారు. పగ, ప్రతీకారాల ఆలోచన చేయడం లేదని.. తమ నాయకుడు చంద్రబాబు చెప్పిన ప్రకారం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పారు. డీజీపీ, ఇతర ఉన్నతాధికారుల తో సమావేశం అనంతరం ఆమె విూడియాతో మాట్లాడారు. ఈ 12 రోజుల్లో చాలా అంశాలను పరిశీలించా. వైకాపా ప్రభుత్వ హయాంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారు. కేవలం బందోబస్తుకే వాడారు. ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. పోలీసు అకాడవిూ, గ్రేహౌండ్ అకాడవిూ లేదు. కేంద్రం నుంచి నిధులొచ్చినా పోలీసు అకాడవిూ నిర్మాణం పూర్తిచేయలేదు.
నేటికీ విశాఖపట్నం జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్ రేకుల షెడ్డులోనే నడుస్తోంది. ఎస్కార్ట్ వాహనాలు కూడా పనిచేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. 2014లో ఇచ్చినవే ఇప్పటికీ వాడుతున్నారు. ఠాణాల్లో స్టేషనరీ ఖర్చులకు కూడా గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని అన్నారు. గంజాయి రవాణా రాష్ట్రంలో బాగా పెరిగింది. నేషనల్ కైర్ర రికార్డులో రాష్టాన్న్రి మూడో స్థానంలోకి తెచ్చారు. గంజాయి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇప్పటికే ఉపసంఘం ఏర్పాటు చేశాం. 100 రోజుల ప్రణాళిక ఏ విధంగా అమలు చేయాలనేదానిపై చర్చిస్తాం. ప్రజల భాగస్వామ్యంతోనే గంజాయిని అరికట్టేందుకు వీలుంటుంది. మంచి ఆలోచనతో పనిచేస్తే విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చు. ఎలాంటి శిక్షణ లేకుండా సచివాలయాల్లో మహిళా పోలీసులను పెట్టారు. ఏ విధంగా వారు పోలీసు విధులు చేయగలరు?వారిని ఏ విధంగా వినియోగించాలనేదానిపై ఆలోచన చేస్తున్నామని వివరించారు. కలిసి కట్టుగా పనిచేసి పోలీసుల పనితీరులో మార్పు తెస్తాం. ప్రజలు ధైర్యంగా స్టేషన్‌కు వెళ్లి బాధలు చెప్పుకొనేలా భరోసా ఇవ్వాలి. సిబ్బంది ప్రజలతో మర్యాదగా మెలగాలి.
రాష్ట్రంలో ఆడపిల్లల అదృశ్యం ఘటనలు చాలా ఉన్నాయి. ఫిర్యాదులతో ఎవరైనా వస్తే వారిని కించపరిచేలా మాట్లాడవద్దు. పోలీసులు అంటే ప్రతిపక్ష పార్టీ నేతల అరెస్టులకే గత ప్రభుత్వం వినియోగించింది. ఇకపై ఫ్రెండ్లీ పోలీసింగ్ రావాలి. సోషల్ విూడియాలో నేటికీ నేను బాధితురాలినే. కొంతమంది ఐపీఎస్ అధికారుల తీరుతో వ్యవస్థకు చెడ్డపేరు వస్తోంది. గత ప్రభుత్వంలో అక్రమ కేసులు పెట్టారు. నాపైనే 23 కేసులు నమోదు చేశారు. అసభ్య పోస్టులపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. అక్రమ కేసులపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. పోలీసులంటే ప్రజల్లో ఒక నమ్మకం, గౌరవం తీసుకొస్తాం. ఏపీలో దిశ చట్టమే లేదు.. ఇక ఆ స్టేషన్ల పేరు కూడా మార్చే ఆలోచన చేస్తాంఅని హోం మంత్రి తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏడాదికి రూ. 50 కోట్లు చొప్పున రూ.250 కోట్లు పోలీసు శాఖకు రావాలని అన్నారు. ఈ ఐదేళ్లల్లో ఈ నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇప్పుడు జీరో నుంచి తాము పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిరదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పేపర్, పెన్ను ఖర్చులకు కూడా గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు.
నిధుల కొరత వల్ల పోలీసులకు విధుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వైసీపీ ప్రభుత్వంలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో గంజాయి రవాణాను పోలీసులు నియంత్రణ చేయలేదని, గతంలో సిఐడీ ఎలా పని చేసిందో అందరూ చూశారన్నారు. హోంశాఖకు ఎంత నిధులు అవసరమో ఒక నివేదిక సిద్దం చేశామని, ప్రాధాన్యత ప్రకారం కేటాయిస్తూ ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. నిధుల కొరత వల్ల ఒకేసారి అన్నీ చేయలేమని చెప్పారు. చాలా చోట్ల సిసి కెమెరాలు, ప్రింగర్ ప్రింట్ స్కానర్‌లు పని చేయడం లేదని, వైసీపీ ప్రభుత్వం వాటిని అసలు పట్టించుకోలేదని అన్నారు. విశాఖలో సిపి కార్యాలయం తాకట్టులో ఉందని, ఎప్పుడు అప్పుల వాళ్లు వస్తారో తెలియదన్నారు. చంద్రబాబుపై నమ్మకంతో 164 సీట్లు ప్రజలు ఇచ్చారని, మాకు రాష్ట్రం, ప్రజలే ముఖ్యమని.. వారి కోసం పని చేస్తామని స్పష్టం చేశారు. ఇంకా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టులో ఉన్నాయన్నారు.
పోలీసులు నిబంధనలు మేరకు పని చేయాలన్నారు. రాజకీయాలు కావాలంటే బయటకి వెళ్లి ఖద్దరు వేసుకోవాలని సూచించారు. పోలీసు అంటే ప్రజల కోసం పని చేసే వ్యవస్థ అనేలా పని చేయాలన్నారు. మహిళల మిస్సింగ్ కేసులపై దర్యాప్తు చేస్తామని, ఏపీలో ప్రతిఒక్కరూ భద్రతగా, భరోసాగా ఉండేలా చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.