27-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 27: ప్రజల ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం,ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో నర్సింగ్ అధికారులు కీలక పాత్ర పోషిస్తారని, అనేక సమస్యలతో సతమతమౌతున్న నర్సింగ్ అధికారుల సమస్యల పరిష్కరానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకవస్తానని టిజెఎస్ అధ్యక్షులు ప్రో. కోదండరాం పేర్కొన్నారు. హైదరాబాద్, నాంపల్లి, తెలుగు యూనివర్సిటీ, ఆడిటోరియం లో గురువారం తెలంగాణ నర్సింగ్ అధికారుల సంఘం రాష్ట్ర సదస్సు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవి కిరణ్ పవ్వడి అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై. శివ సాయి కృష్ణ స్వాగతం పలుకగా, ప్రో. కోదండరాం ముఖ్యఅతిథిగా, ఐ.ఎన్.టి.యు.సి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.రాగన్న గౌడ్, సంఘం సలహాదారు బి. వెంకటేశ్వర్ రెడ్డి ప్రత్యేక అథితులుగా పాల్గొన్నారు. ఈ సదస్సునుద్దేశించి ప్రో. కోదండరాం మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం నర్సింగ్ అధికారుల సమస్యల పట్ల ఉదాసీన వైఖరి ప్రదర్శించిందని నర్సింగ్ ఉద్యోగుల బదిలీలలో స్థానికత పాటించలేదని, డీఏ, పిఆర్సి పెంపును పట్టించుకోలేదని, ఆసుపత్రులలో కనీసం నర్సింగ్ ఉద్యోగులకు దుస్తులు మార్చుకునే గది, త్రాగు నీరు, వాష్‌రూమ్‌లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఫుర్తిగా విఫలమైందని ఆరోపించారు.
నర్సింగ్ అధికారులు ఎదుర్కుంటున్న అన్ని సమస్యలను ముఖ్యంగా జి.ఓ.నెంబర్ 317 ద్వారా స్థానికత కోల్పోయిన నర్సింగ్ ఉద్యోగులకు న్యాయం మరియు జాతీయ వైద్య మండలి నిబంధనల మేరకు ప్రతి 100 పడకల ఆసుపత్రిలో 5 మంది హెడ్ నర్సుల నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరానికి కృషి చేస్తానని ప్రో. కోదండరాం హావిూ ఇచ్చారు. వై. నాగన్న గౌడ్ మాట్లాడుతూ నర్సింగ్ వృత్తి ఒక కళ మరియు సైన్స్ అలాగే మానవతా సేవ అని, అనారోగ్యం నుండి కోలుకోవడానికి మరియు సరైన ఆరోగ్యం మరియు జీవన నిర్వహించడానికి ప్రజలకు సహాయపడుతుందని తెలిపారు. అవసరమైన వైద్య సేవలను అందించే ఆరోగ్య సంరక్షణ అధికారుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు. రాష్ట్ర ప్రజలకు సమర్థవంతమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి ’ఆరోగ్యకరమైన తెలంగాణ’ నిర్మాణంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే 7,000 మంది నర్సింగ్ అధికారులను నియమించిందని గుర్తు చేసారు.
సంఘం ఐక్యతతో ఉంటేనే హక్కులు అందించబడతాయని, ఆరోగ్య సంరక్షణ ప్రదాతలైన నర్సింగ్ అధికారులు సమస్యలపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ను కలసి పరిష్కరానికి కృషి చేస్తానని వై. నాగన్న గౌడ్ చెప్పారు. ఈ సదస్సులో తెలంగాణ నర్సింగ్ అధికారుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పి. కవిత, ఉపాధ్యక్షులు ఎస్. జీవన్, కె. విజయేశ్కాంత్, ఈ. స్వాతి, సహాయ కార్యదర్శులు ఎండి. అలావుద్దీన్, కె. రామ నాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శిలు జి. నరేంద్ర, కె. వినోద్, కోశాధికారి జి. నరేష్, నేతలు రాజేందర్ రెడ్డి, నందకుమార్, మొగిరాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.