28-06-2024 RJ
తెలంగాణ
వరంగల్, జూన్ 28: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 న రుక్నాబాయి, సీతారామరావు దంపతులకు పీవీ జన్మించాడు. భార దేశంలో ఓ సామాన్యుడు గద్దెనెక్కడం అనేది అంతా ఓ భ్రమ. పేరుకు ప్రజాస్వామ్య దేశమే అయినా, రాచరికాన్ని తలపించేలా పాలన మొత్తం తరతరాలుగా ఏదో ఒక్క కుటుంబం చేతిలోనే ఉంటుందనేది భారతీయులందరికీ తెలిసిన సత్యం. అయితే ఆ ఆనవాయితీని ఛేదిస్తూ, 1991వ సంవత్సరంలో మొట్టమొదటి సారిగా దక్షిణభారత దేశం నుంచి ఒకవ్యక్తి, అందులోనూ తెలుగువాడు అయిన పీవీ నరసింహారావు దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ఆర్థికవ్యవస్థను ఒకగాడిలోకి తీసుకురాగలిగారు. ప్రజల్లోఆర్థిక భద్రత, ఒక నమ్మకం కల్పించడంలో పీవీ ఎంతో కృషి చేశారు. అందుకే ఆర్థిక సంస్కరణల జాతిపితగా పీవీ నరసింహా రావు కీర్తి గడిరచారు.అంతేకాదు.. ఒక గొప్ప వ్యూహకర్త, అపర చాణక్యుడిగా పేరు పొందారు.
మంచి రాజనీతిజ్ఞుడిగా కూడా పేరు, ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా గొప్ప ప్రధానమంత్రిగా ప్రశంసలు అందుకున్న ఏకైక వ్యక్తి పీవీ మాత్రమే.కానీ ఆ సమయం నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించి, పేదరికం పెరిగిపోయి, అత్యంత క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. అంతా శూన్యం, దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలో దిక్కుతోచని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పదవీ బాధ్యతలు స్వీకరించిన పీవీ తనదైన ఆలోచనలతో, ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశానికి ఒక దశా`దిశా ఇచ్చి తన సత్తా ఎంటో చూపించారు. రాజకీయాల్లో స్థితప్రజ్ఞత ఉన్న అరుదైన నేతల్లో పివి ముందుంటారు. ఆయన స్వార్థం కోసం ఏనాడూ రాజకీయాలు చేయలేదు. అలాగే ఆయనలోని స్వార్థం దేశానికి మంచి చేయాలన్న తపన తప్ప మరోటి కాదు. అపర చాణుక్యుడు అంటూ ఆయనను కీర్తించినా రాజకీయాల కోసం తన చాణక్యాన్ని ఎప్పుడూ ప్రదర్శించలేదు. సానుకూల, ప్రతికూల రాజకీయాలను ఆమూలాగ్రం ఔపోసన పట్టిన ఘటికుడు ఆయన.
అందుకే వాటిని అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా పాలన చేసి..తిరుగలేని నేతగా రుజువు చేసుకున్నారు. నిజానికి పివి హయాం తరవాత సంకీర్ణాలు మొదలయ్యాయి. పివి కూడా ఆనాడు సంకీర్ణ రాజకీయాలకు తెరతీసి ఉంటే దేవేగౌడ స్థానంలో మళ్లీ పివియే ప్రధాని అయ్యేవారు. తనకున్న స్థానాలతో తానే మరోమారు ప్రధానిగా అయ్యేందుకు సంకీర్ణ రాజకీయాలు నెరపి ఉంటే భారత చరిత్ర మరోలా ఉండేది. అయినా ఆయన పాలనా కాలం ఓ స్వర్ణయుగం. ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ప్రధాన మంత్రిగా, ఆర్థిక సంస్కరణలను అద్వితీయంగా అమలుపరిచిన పాలనాదక్షుడిగా పీవీ నరసింహరావు చరిత్ర సృష్టించారు. అందుకే బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. ఆయన పాలనా ఫలితాలు, ఫలాలు నేటికీమనమంతా అనుభవిస్తూనే ఉన్నాం. వాటి నుండి పాఠాలు నేర్చుకోవడంలో మాత్రం వెనకబడి ఉన్నాం.