28-06-2024 RJ
సినీ స్క్రీన్
సుమన్ చిక్కాల దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ పోలీసు ఆఫీసర్‌గా నటించిన చిత్రం ’సత్యభామ’ కైమ్ర్ థ్రిల్లర్ కథతో రూపొందిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చి మెప్పించింది. ఇప్పుడీ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అలరిస్తోంది. నవీన్‌చంద్ర కీలకపాత్రలో కనిపించిన ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, నాగినీడు, హర్షవర్థన్, రవి వర్మ, తదితరులు నటించారు. కె.సత్యభామ షీ టీమ్‌లో ఏసీపీ స్థాయిలో పనిచేస్తుంటారు. చూడటానికి శాంతంగా కనిపించినా, నేరస్థుల నుంచి నిజాలు రాబట్టడంలో దిట్ట. తనకు అప్పజెప్పిన కేసుల్ని అంత సులభంగా వదిలిపెట్టదని పేరు. రచయిత అమరేందర్ (నవీన్‌చంద్ర)ని ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆమె వ్యక్తిగత జీవితానికంటే, వృత్తికే ఎక్కువ సమయం కేటాయిస్తుంటుంది.
షీ టీమ్‌లో పనిచేస్తున్నప్పుడే హసీనా అనే ఓ బాధితురాలు గృహహింసని అనుభవిస్తూ సాయం కోసం సత్యభామ దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత హసీనా తన భర్త చేతిలో దారుణ హత్యకి గురవుతుంది. హసీనాతోపాటు, ఎంతోమంది జీవితాలతో ఆడుకున్న ఆ నేరస్థుడిని పట్టుకునే క్రమంలో సత్యభామకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆ కేసుని ఆమె వ్యక్తిగతంగా తీసుకోవడానికి కారణమేమిటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.